మెదక్ జిల్లాలో శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు

మెదక్ జిల్లాలో శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
  • ఏడుపాయల జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు.. కొమురవెల్లిలో 41 వరుసల పెద్దపట్నం

మెదక్/పాపన్నపేట, వెలుగు: శివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో జరిగే మహా జాతరకు అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి మూడు రోజులు జరిగే జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి 8 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు ఎండోమెంట్, ఆర్టీసీ ఇతర శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత శాఖల అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించి ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని 
ఆదేశించారు. 

స్పెషల్​ బస్సులు నడపనున్న ఆర్టీసీ

ఏడుపాయల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మెదక్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి 120 స్పెషల్ బస్సులు నడుపనున్నారు. హైదరాబాద్, జేబీఎస్​, బాలానగర్, నర్సాపూర్, పటాన్ చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, రామాయంపేట, ఎల్లారెడ్డి నుంచి ఏడుపాయల వరకు స్పెషల్ బస్సులు నడుపుతారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు శాఖ వెయ్యి మందితో భద్రత ఏర్పాటు చేస్తోంది.

 పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో వందలాది మంది పారిశుధ్య కార్మికులు పనిచేయనున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్ లు అందుబాటులో ఉంచారు.  భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఘనపూర్ ఆనకట్ట వద్ద, మంజీరా నది పాయల వెంట చెక్ డ్యాం వద్ద, ప్రధాన ఆలయం ముందు షవర్లు ఏర్పాటు చేశారు. జాతర అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేశారు. భక్తులు వంటలు చేసుకునేందుకు, తాగునీటి కోసం జాతర ప్రాంగణాల్లో అనేక చోట్ల నల్లాలను ఏర్పాటు చేశారు. అలాగే టెంపరరీ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకు వచ్చారు. 

గజ ఈతగాళ్ల ఏర్పాటు

భక్తులు ఎవరైనా ప్రమాద వశాత్తు ప్రాజెక్ట్, నది పాయల్లో పడిపోతే వారిని కాపాడేందుకు ఫిషరీస్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ పెట్టారు. రాజ గోపురం ముందు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలకు వెనకకు జరిపించారు. అక్కడి నుంచి కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ వరకు రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్డు నిర్మించారు. బస్సులు, కార్లు, జీపులు, ఆటోలు, టూ వీలర్లకు వేర్వేరుగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. నాగసాన్ పల్లి వైపు నుంచి వచ్చే వెహికల్స్​కోసం అటు వైపు పార్కింగ్ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు, అవసరమైన మెడిసిన్స్, బెడ్స్ అందుబాటులో ఉంటాయి. 

41 వరుసల పెద్దపట్నం

సిద్దిపేట/కొమురవెల్లి : శివరాత్రి సందర్భంగా బుధవారం ఒక్కరోజే  మల్లన్న దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి 70 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇప్పటికే తోటబావి వద్ద నిర్వహించే పెద్ద పట్నానికి అన్ని సిద్దం చేశారు. లింగోద్భవ కాలంలో గర్భగుడిలో ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన తర్వాత తోటబావి వద్ద 150 మంది స్థానిక ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో 41 వరుసలతో పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కల్యాణ మండపంలో ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. పెద్ద పట్నం వేసిన తర్వాత ఆలయ అర్చకులు ఉత్సవ  విగ్రహలతో ముందుగా పట్నం దాటుతారు. అనంతరం భక్తులు, శివసత్తులు గుంపులుగా పెద్దపట్నం దాటుతూ, ముగ్గును నుదుట బొట్టు పెట్టుకుంటూ వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.

5 వేల మంది మహారాష్ట్ర భక్తుల రాక

శివరాత్రిని పురస్కరించుకుని మహారాష్ట్ర నుంచి ఐదు వేల పై చిలుకు భక్తులు కొమురవెల్లికి రానున్నారు. సంప్రదాయం ప్రకారం మహారాష్ట్ర భక్తులు గురువులతో కలసి కొమురవెల్లికి చేరుకుని ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని మూడు రోజులు అక్కడే ఉంటారు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న మల్లికార్జున స్వామి ప్రతిమలకు శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏక కాలంలో మల్లికార్జున స్వామి దర్శనానికి భజనలు చేస్తూ స్వామివారి దర్శనానికి వస్తారు. మహారాష్ట్ర భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చే సమయంలో దేవస్థానం అధికారులు 2 గంటల పాటు క్యూ లైన్లు మూసి వేసి వారికి దర్శనం కల్పిస్తారు.