
- యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట టైం
- భక్తులతో కిక్కిరిసిన భద్రాచలం, కొమురవెల్లి
యాదగిరిగుట్ట/భద్రాచలం/కొమురవెల్లి, వెలుగు : వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్టతో పాటు భద్రాచలం, కొమురవెల్లికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యాదగిరిగుట్టలో స్వామి వారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. యాదగిరిగుట్టలోని కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి.
స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు జరిపించిన వివిధ రకాల పూజలు, నిత్యకైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.54,91,048 ఆదాయం వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు. భద్రాచలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలికంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను ఆదివారం నుంచి పునరుద్ధరించారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి కల్యాణంలో పాల్గొన్నారు.
అర్చకులు ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో సుప్రభాతసేవ, మూలవరులకు అభిషేకం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. కొమురవెల్లి ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. గంగరేణి చెట్టు, ముఖమంటపం వద్ద భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా మల్లన్న దర్శనానికి సుమారు నాలుగు గంటల టైం పట్టింది. యాదగిరిగుట్ట ఈవో భాస్కర్‌రావు కుటుంబ సమేతంగా మల్లన్నను దర్శించుకున్నారు.