పీసీసీ కార్యవర్గానికి తాత్కాలిక బ్రేక్

పీసీసీ కార్యవర్గానికి తాత్కాలిక బ్రేక్
  • రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మారడం వల్లే ఆలస్యం
  • కొత్త ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించాకే ప్రకటన

హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గ ప్రకటనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ మారడం, ఆమె స్థానంలో సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రావడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త ఇన్​చార్జ్ కార్యవర్గ జాబితాను పరిశీలించి, ఆమోద ముద్ర వేశాకే తుది ప్రకటన ఉంటుందని అంటున్నారు. 

ఇందుకు మరో వారం పట్టవచ్చని గాంధీ భవన్ లో చర్చ నడుస్తున్నది. పీసీసీ కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉమ్మడి జిల్లాకు ఒక ఉపాధ్యక్షుడిని, కొన్ని చోట్ల ఇద్దరి చొప్పున పేర్లను ఖరారు చేసిన పీసీసీ నాయకత్వం ఆ లిస్టును హైకమాండ్ కు పంపించింది. 

సీఎం రేవంత్ రెడ్డి, అప్పటి ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కలిసి లిస్ట్ ఫైనల్ చేసి ఢిల్లీకి పంపించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా దీనికి ఆమోద ముద్ర వేశారు. ఇక రేపు, మాపో ప్రకటించనున్నారని అనుకున్న సమయంలో అనూహ్యంగా ఇన్ చార్జ్ మారడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.