- పనులకు తాత్కాలిక బ్రేక్
- నేడు హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష
- చుట్టుముడుతున్న వివాదాలు
- ఎన్జీటీ స్టేతో నిర్మాణంపై నీలినీడలు
- ఇద్దరు సభ్యులతో కమిటీ వేసిన ఎన్జీటీ
భద్రాచలం,వెలుగు: సీతమ్మసాగర్ బ్యారేజీ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని నీటిపారుదలశాఖ కాంట్రాక్టర్లకు సూచించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే, ఆ స్టేను ధిక్కరించి పనులు చేస్తున్నారని పిటిషనర్లు తిరిగి కోర్టును ఆశ్రయించడంతో స్టే తర్వాత జరుగుతున్న పనులు పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 29న (సోమవారం) ప్రభుత్వం నీటిపారుదల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. పనులపై ఎన్జీటీ స్టే, ఆపితే జరిగే నష్టాలు, పెరగనున్న నిర్మాణ ఖర్చు, నిర్ణీత టైమ్‌కు ప్రాజెక్టు పనులు జరగకపోతే కలిగే ఇబ్బందులు, దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేయాలా..? చేస్తే ఎలా..? అనే అంశాలపై చర్చించనున్నారు. బ్యారేజీతో పాటు కరకట్ట నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా చర్ల మండలంలో సీతమ్మసాగర్ కరకట్టల నిర్మాణాలను అడ్డుకుని ఎన్జీటీ స్టేను ధిక్కరించి పనులు చేస్తున్నారని నిరసన తెలిపారు. దీనికి తోడు పిటిషనర్లు తెల్లం నరేశ్, బూర లక్ష్మీనారాయణ స్టే తర్వాత జరుగుతున్న పనుల వివరాలతో కూడిన ఫొటోలను ఎన్జీటీకి తిరిగి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హైదరాబాద్‌లోని మినిస్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ , క్లైమేట్ ఛేంజ్ రీజినల్ డైరెక్టర్, గోదావరి జలాల బోర్డు ఎస్ఈలతో కూడిన ద్విసభ్య కమిటీని నియమించింది. జులై 12కు తిరిగి ఈ కేసును వాయిదా వేసింది.
నిర్మాణంపై పెరుగుతున్న అనుమానాలు..
సీతమ్మసాగర్ బ్యారేజీ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించనున్నారు. నిర్మాణం నిలిపివేయాలని ఎన్జీటీ స్టే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో బ్యారేజీపై నీలినీడలు అలుముకున్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా అశ్వాపురంలోని హెవీవాటర్ ప్లాంట్, సింగరేణి గనులు మునిగిపోతాయని సుప్రీంకోర్టులో కేసు వేసి ఇప్పుడు అక్కడే సీతమ్మసాగర్ బ్యారేజీ ఎలా నిర్మిస్తున్నారు...? అని సీడబ్ల్యుసీ, పర్యావరణ శాఖల నుంచి పర్మిషన్లు రావడం లేదు. 2022 గోదావరి వరదల బీభత్సం కూడా ఇంజినీర్లను ఆలోచనలో పడేశాయి. ఇన్ని ఇక్కట్ల మధ్య 320 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణంపై కూడా ప్రతిష్ఠంభన నెలకొంది.
ఎత్తు, ముంపుపై తర్జనభర్జన
బ్రిటీష్‌వారి హయాంలోనే దుమ్ముగూడెం-–అశ్వాపురం మధ్య కాటన్ దొర ఆనకట్ట నిర్మించారు. ఇప్పుడు దీనికి దిగువన 37.25 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతమ్మసాగర్ బ్యారేజీని 63 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి ఇది 189 అడుగులు అన్నమాట. 1986 గోదావరి వరదల టైంలో భద్రాచలం వద్ద గోదావరి సముద్ర నీటి మట్టానికి 183 అడుగుల వరద వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే బ్యాక్‌వాటర్‌తో పాటు 50లక్షల క్యూసెక్కుల వరద వస్తే భద్రాచలం వద్ద సముద్రమట్టానికి 220 అడుగుల మేర నీరు నిల్వ ఉంటుంది. హైదరాబాద్ ఐఐటీ అధ్యయన బృందం చెప్పిన నిజం ఇది. ఇప్పుడు కడ్తున్న బ్యారేజీ 63 మీటర్లు అంటే సముద్ర మట్టానికి 189 అడుగులు. వరదల టైంలో బ్యారేజీ మునక ఖాయమని ఇంజినీర్లు చెప్తున్నారు. రిటైర్డ్ ఇంజినీర్లు కూడా ఇదే విషయాన్ని సర్కారుకు సూచించారు. ఒకవైపు తెలుగురాష్ట్రాల గోదావరి జలాల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. 150 మీటర్ల ఎత్తులో కడ్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం రామాలయం కూడా మునుగుతుందని ఇంజినీర్ల విశ్లేషణ. అలాంటప్పుడు సీతమ్మసాగర్ బ్యారేజీ కూడా మునుగుతుందని ఐఐటీ అధ్యయన బృందం రిపోర్ట్స్ తెల్పుతున్నాయి. గతేడాది వరదలు, వర్షాల కారణంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరి పరివాహకంతో పాటు ఇతర మైదాన ప్రాంతాల్లో 1,16,251 హెక్టార్ల భూభాగం ముంపునకు గురైంది. సీతమ్మసాగర్ బ్యారేజీ వద్ద 54.6 మీటర్ల వరద ప్రవహించింది.
పరిహారంపై ఆందోళన..
సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం వల్ల 25 కి.మీల మేర బ్యాక్ వాటర్ ప్రభావం ఉంటుంది. ఇందు కోసం కుడివైపు 19 కి.మీలు, ఎడమవైపు 31 కి.మీలు మేర కరకట్టలు నిర్మిస్తున్నారు. ఇందుకు 3,123 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. రూ.8లక్షల చొప్పున ఎకరానికి పరిహారమిస్తున్నారు. కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడింతలు అంటే రూ.32లక్షలు కావాలని ముంపు బాధితులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు సీతమ్మసాగర్ బ్యారేజీ ఎత్తు విషయంలో గోప్యత, అంచనా వ్యయం పెరుగుతుండడంతో ముంపు కూడా ఎక్కువగా ఉంటుందని నిర్వాసిత గ్రామాల వారు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పర్మిషన్లు లేకుండా బ్యారేజీ నిర్మిస్తున్నారని, వెంటనే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పర్మిషన్లు లేవని ఎన్జీటీ కూడా స్టే ఇచ్చింది. దీంతో ఇప్పుడు బ్యారేజీ నిర్మాణం ఆపేయాలని నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏపీ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీ(సెంట్రల్ వాటర్ కమిషన్)లో ఫిర్యాదులు చేస్తోంది. ఇన్ని వివాదాలు, సాంకేతిక చిక్కుల్లో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణ పనులు పడ్డాయి.