- కాలేజీలో జాయిన్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
- విచారించకుండానే సస్పెండ్ చేశారని వాదించిన న్యాయవాది
- ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం
వరంగల్, వెలుగు : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ సస్పెన్షన్ ను హైకోర్టు తాత్కాలికంగా రద్దు చేసింది. అతడిని కాలేజీలో జాయిన్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‍దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రీతి తాను డ్యూటీ చేస్తున్న ఎంజీఎం హాస్పిటల్‍లో అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన సిబ్బంది.. మెరుగైన ట్రీట్‍మెంట్ కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ 26న కన్నుమూసింది. దీనిపై గిరిజన, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‍గా తీసుకుని మొట్టికాయలు వేయడంతో పోలీసులు లోతుగా విచారణ చేశారు. మొత్తంగా తోటి విద్యార్థులు, అధికారులు, హాస్పిటల్ సిబ్బంది వాట్సాప్ మెసేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ లతో సీనియర్ స్టూడెంట్ సైఫ్ ర్యాగింగ్ వల్లే ప్రీతి సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో సైఫ్ పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సైతం సైఫ్‍ను సస్పెండ్ చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్, యూజీసీలకు సిఫారసు చేసింది. దీంతో అతనిపై ఏడాది వరకు సస్పెన్షన్ వేటు పడింది. కాగా, పోలీసులు కొన్ని రోజుల క్రితం ఈ కేసులో హైకోర్టుకు చార్జిషీటు సమర్పించారు. సైఫ్‍ను విచారించకుండానే యాంటీ ర్యాగింగ్ కమిటీ అతడిపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించడం సరికాదని నిందితుడి తరఫు న్యాయవాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
దీనితో ఏకీభవించిన హైకోర్టు.. సైఫ్ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంది. సైఫ్‍పై చర్యలను తాత్కాలికంగా రద్దుచేస్తూ అతను క్లాసులు వినేందుకు అవకాశం కల్పించాలని కాలేజీ ప్రిన్సిపాల్‍కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు సూచనల మేరకు సైఫ్ తరగతులు వినేందుకు ఆదేశాలు ఇచ్చామని ప్రిన్సిపాల్ మోహన్‍దాస్ వెల్లడించారు. వారం తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీ మరోసారి విచారణ జరిపి తీర్మానాన్ని కోర్టుకు సమర్పించనుందని ఆయన వెల్లడించారు.