సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా తుపాకీ తూటాల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్ కౌంటర్లో 10 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ పది మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
సుక్మా జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న అడవుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డులకు(DRGs), మావోయిస్టులకు మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులను భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి.
శుక్రవారం ఉదయం సుక్మా జిల్లాలోని దండకారణ్యంలో మావోయిస్టుల ఉనికిపై పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో మావోల కోసం డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డులు దండకారణ్యాన్ని జల్లెడ పట్టారు. ఒక దగ్గర మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులు గమనించారు. మావోయిస్టులను పోలీసులు చుట్టుముట్టారు. భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు.
భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ సమయంలోనే భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్ తెలిపారు. నవంబర్ 16న కూడా అబుజ్మర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.