- ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో గాజాలో బాలికలు, ప్రజల దీనస్థితి
- కనీస వస్తువులు కూడా అందని దుస్థితి
- ఒకే టెంట్లో వందలాది మంది కిక్కిరిసి జీవనం
- రఫా బోర్డర్‌ను ఇజ్రాయెల్ మూసేయడంతో మందులు కూడా అందని పరిస్థితి
గాజా: పదినెలల ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో గాజాలో అమాయక ప్రజల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. బాంబుల మోతల్లో వారి కష్టాలను వినేవారే కరువయ్యారు. అత్యవసర వస్తువులు అందక, కనీస అవసరాలు తీరక వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. స్నానానికి నీళ్లు, తలకు షాంపూ లేకపోవడంతో అక్కడ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాలికలు జుట్లు కత్తిరించుకోవాల్సిన దీనస్థితి నెలకొన్నది. యుద్ధంతో సరిహద్దులను ఇజ్రాయెల్ మూసేయగా.. ఇంటిని శుభ్రం చేసే ఉత్పత్తులు, నెలసరి వస్తువులు అందక వారు పడే బాధను చూసి వారికి డాక్టర్లు చలించిపోతున్నారు.
చెత్తకుప్పల్లా శరణార్థ శిబిరాలు
నిరుడు అక్టోబర్‌లో ఇజ్రాయెల్–హమాస్యుద్ధం ప్రారంభమైంది. హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్గ్రూపులు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేయగా, యుద్ధం మొదలైంది. దీంతో హమాస్‌ను నాశనం చేయడం, బందీలను విడిపించే లక్ష్యంతో ఇజ్రాయెల్ గాజాపై ప్రతిదాడికి దిగింది. బాంబుల మోతలు మోగించడంతో అక్కడి ప్రజలు తమ ఇండ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఒకే టెంట్లో వందలాది మంది కిక్కిరిసి జీవనం సాగిస్తున్నారు. రఫా సరిహద్దును ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న దగ్గరి నుంచి అంతర్జాతీయ మానవతా సాయం అందకుండా పోయింది. దీంతో ఆ శిబిరాల్లో కనీస అవసరాలు తీరే పరిస్థితులు కూడా లేవు. ఇక చెత్త తొలగింపు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. క్లీనింగ్వస్తువులు అందక శరణార్థ శిబిరాలు చెత్తకుప్పల్లా మారిపోయాయి.
మందులు కొనలేని పరిస్థితి
శరణార్థ శిబిరాల్లోని టెంట్లలో జనం కిక్కిరిసిపోయి నివసిస్తుండగా.. చెమటతో ఒంటిపై దద్దుర్లు వచ్చి చర్మసమస్యలతో వారు బాధపడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. టెంట్లలో స్నానానికి నీళ్లు, తలకు షాంపూలేక మురికిపట్టిపోవడంతో విధిలేక జుట్టు కత్తిరించుకోవాలని అక్కడి బాలికలకు తాము సూచిస్తున్నట్టు డాక్టర్ లోబ్నా ఆల్ అజైజా పేర్కొన్నారు. మందులు కూడా కొనలేని పరిస్థితి నెలకొన్నదని, గాయాలకు రాసే చిన్న ఆయింట్‌మెంట్ ధర రూ. 4,449గా ఉన్నట్టు తెలిపింది. రఫా సరిహద్దును ఇజ్రాయెల్మూసేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె అంటున్నారు.
ఆ బోర్డర్‌ను తెరిస్తే ఇక్కడి ప్రజలకు మానవతా సాయం అందుతుందని, సరైన ఔషధాలు దొరికి చాలామంది ప్రాణాలు నిలబడతాయని ఆమె పేర్కొంటున్నది. కమల్అద్వాన్ హాస్పిటల్లో పనిచేసే అజైజా ఇల్లు కూడా ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఆమె పలువురు వైద్యులతో కలిసి శరణార్థ శిబిరాల్లో టెంట్ క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నది. అక్కడి అమ్మాయిలు, ప్రజల దీనస్థితిని చూసి చలించిపోయింది. వారి బాధలను ప్రపంచం కళ్లకుకట్టింది.