యాదగిరిగుట్టలో కొత్త పీటలు..ఒకే సైజులో ఉండే పదింటిని కొనుగోలు చేసిన ఆలయ అధికారులు

యాదగిరిగుట్టలో కొత్త పీటలు..ఒకే సైజులో ఉండే పదింటిని కొనుగోలు చేసిన ఆలయ అధికారులు
  • ఈ నెల 11న జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ 
  • ఇన్​చార్జ్ ఈవో రామకృష్ణారావుపై బదిలీ వేటు.. కొత్త ఈవోగా భాస్కర్ రావు నియామకం  

యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానంలో పది కొత్త పీటలు కొన్నారు. ఒకే సైజులో ఉండే పీట లనే ఆలయ అధికారులు కొనుగోలు చేశారు. లక్ష్మీనర్సింహస్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీలకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో వాళ్లు కూర్చోవడానికి వీటిని వేస్తారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చిన్న పీట వేశారని విమర్శలు రావడం, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో ఆలయ అధికారులు కొత్త పీటలు కొనుగోలు చేశారు. 

ప్రొటోకాల్ విషయంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం.. 

ఈ నెల 11న యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్​రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి హాజరయ్యారు. స్వామి వారి దర్శనం అనంతరం సీఎం సహా మంత్రులకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

4 పెద్ద పీటలు, 2 చిన్న పీటలు వేయడంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ చిన్న పీటలపై కూర్చున్నారు. దీంతో ఎస్సీ, బీసీ మంత్రులిద్దరికీ అవమానం జరిగిందం టూ సోషల్​ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు సీఎం రేవంత్​లక్ష్యంగా విమ ర్శలు చేశారు. చివరకు దీనిపై భట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తానే కావాలని చిన్న పీటపై కూర్చున్నానని ఆయన చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.  

ఈవోపై చర్యలు.. 

సీఎం, మంత్రుల పర్యటన సమయంలో ప్రొటోకాల్​ విషయంలో ఆలయ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతాధికారులు ఆలయ ఇన్​చార్జ్ ఈవో రామకృష్ణారావు నుంచి వివరణ తీసుకున్నారు. ఏఈవోల కారణంగా తప్పు జరిగిందని ఈవో చెప్పినా ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో ఆయనపై గురువారం బదిలీ వేటు వేశారు. కొత్త ఈవోగా భాస్కర్ రావును నియమించారు.