ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10 నామినేషన్లు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10 నామినేషన్లు

నాగర్​ కర్నూల్, వెలుగు:   ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పది నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్​ కర్నూల్​ జిల్లాలో 6, గద్వాల జిల్లాలో 4 నామినేషన్లు పడ్డాయి. నాగర్​ కర్నూల్ జిల్లాలో మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా వి. రామస్వామి, నీలం కృష్ణయ్య, తలారి బాలవర్ధన్  కొల్లాపూర్ ఆర్వో కుమార్​ దీపక్​కు నామినేషన్​ పత్రాలు అందజేశారు.

ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఆది సంధ్యారాణి నామినేషన్ వేశారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్​సీపీ) పక్షాన జటావత్ రామచంద్రు నాయక్, సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ నుంచి పాలాది కిరణ్ కుమార్ నామినేషన్​ దాఖలు చేశారు. 
 
గద్వాల జిల్లాలో 4 

గద్వాల, వెలుగు: గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల  స్థానాలకు నియోజకవర్గానికి రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు అపూర్వ్ చౌహన్, చంద్రకళ తెలిపారు. గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కోసం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ధరూర్ మండలం జాంపల్లి విలేజ్ కి చెందిన సుబ్బారావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కేటి దొడ్డి మండలం చింతలకుంట విలేజ్ కి చెందిన గొంగళ్ల రంజిత్ కుమార్ మంగళవారం నామినేషన్లు వేశారు. అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం బీఆర్ఎస్ తరఫున ఐజ టౌన్ కు చెందిన రిటైర్డ్ ఎంఈఓ మేరమ్మ, బీజేపీ తరఫున మాదన్న  నామినేషన్లు సమర్పించారు.