మళ్లీ కల్తీ కల్లు కల్లోలం.. పాలమూరులో మందు కల్లు తాగి పది మందికి అస్వస్థత

మళ్లీ కల్తీ కల్లు కల్లోలం.. పాలమూరులో మందు కల్లు తాగి పది మందికి అస్వస్థత
  • మళ్లీ కల్తీ కల్లు కల్లోలం
  • పాలమూరులో మందు కల్లు తాగి పది మందికి అస్వస్థత
  • బిత్తిరి చూపులు చూస్తూ పిచ్చిపట్టినట్లు వింత ప్రవర్తన
  • జిల్లా జనరల్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్.. ఆరుగురు డిశ్చార్జ్​
  • నలుగురు బాధితుల్లో ఓ మహిళ పరిస్థితి క్రిటికల్
  • విషయం బయటకు రాకుండా అధికార పార్టీ యత్నం

మహబూబ్​నగర్, వెలుగు : పాలమూరు జిల్లాలో కల్తీకల్లు మళ్లీ కల్లోలం సృష్టించింది. ఈ కల్లు తాగిన వారు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడంతో వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్​లో చేర్పించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని మోతీ నగర్, బొక్కల్లోనిపల్లి, కోయనగర్ ప్రాంతాల్లో కల్లు దుకాణాలు ఉన్నాయి. ఈదులు, తాళ్లు లేకపోవడంతో కొంత కాలంగా ఈ ప్రాంతాల్లోని దుకాణాల్లో మందు కల్లు అమ్ముతున్నారు. దానికి అలవాటుపడిన వారు రోజులాగే శుక్రవారం ఉదయం కల్లు తాగి ఇంటికి వెళ్లారు. 

కొందరు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. బిత్తిరి చూపులు చూస్తూ, నత్తినత్తిగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు మూతి పక్షవాతం వచ్చినట్లు మారడం,  నాలుకను బయట పెట్టి పిచ్చిగా ప్రవర్తించడం వంటివి చేశారు. దీంతో ఆందోళనకు గరైన బాధితుల కుటుంబ సభ్యులు వారిని జిల్లా జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. అర్ధరాత్రి వరకు అవే లక్షణాలతో ఆ ప్రాంతాలకు చెందిన పది మంది హాస్పిటల్​లో అడ్మిట్  అయ్యారు. 

ఈ విషయం బయటకు రాకుండా రూలింగ్​ పార్టీకి చెందిన లీడర్లు ప్రయత్నం చేశారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విషయం బయటకు పొక్కింది. అప్పటికే ఆరుగురికి ట్రీట్​మెంట్​ చేసిన డాక్టర్లు.. వారిని డిశ్చార్జి చేశారు.  మిగతా నలుగురిని అబ్జర్వేషన్​లో ఉంచారు. వారిలో ఓ మహిళ పరిస్థితి క్రిటికల్​ ఉందని సమాచారం. ఈ విషయంపై ఎక్సైజ్​ ఆఫీసర్లను వివరణ కోరగా, కల్తీకల్లు విషయంపై తమకు ఎవరూ కంప్లైంట్​ చేయలేదని చెప్పారు.