బాంద్రా రైల్వేస్టేషన్‌‌లో తొక్కిసలాట...తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

బాంద్రా రైల్వేస్టేషన్‌‌లో తొక్కిసలాట...తొమ్మిది మందికి తీవ్ర గాయాలు

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా సొంతూర్లకు వెళ్లేందుకు వచ్చిన ప్యాసింజర్లతో  బాంద్రా రైల్వేస్టేషన్‌‌ ఆదివారం కిక్కిరిసిపోయిందని అధికారులు వెల్లడించారు. బాంద్రా నుంచి గోరఖ్‌‌పూర్‌‌కు వెళ్లే అంత్యోదయ ఎక్స్‌‌ప్రెస్ ట్రైన్ 1వ నంబర్ ప్లాట్‌‌ఫారమ్‌‌ మీదకు రాగానే ప్యాసింజర్లు ఒక్కసారిగా దాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారని తెలిపారు. ప్రయాణికులు ఎక్కువమంది ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు.  

గాయపడిన తొమ్మిది మంది ప్రయాణికుల్లో ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉందని.. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వివరించారు. బాధితులు బాంద్రాలోని బాబా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలిపారు. ఘటనపై పశ్చిమ రైల్వే ముఖ్య ప్రతినిధి వినీత్ అభిషేక్ స్పందించారు. పండగల వేళ రద్దీ కారణంగా ఉదయం 5:15 కి నడపాల్సిన ట్రైన్ ను తెల్లవారుజామున 3 గంటలకు ముందుగానే ప్లాట్‌‌ఫారమ్‌‌పైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు.

అయినా రద్దీ ఎక్కువగా ఉందని..చాలామంది ప్యాసింజర్లు ట్రైన్ రన్నింగ్​లో ఉండగానే ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిపోయారని వివరించారు. పండుగల సందర్భంగా ముంబై నుంచి130 స్పెషల్ ట్రైన్లను ఉత్తరప్రదేశ్, బీహార్‌‌లతోపాటు వివిధ గమ్యస్థానాలకు నడుపుతున్నామని చెప్పారు. ఊర్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని.. సీట్ల కోసం ట్రైన్లను రన్నింగ్​లో ఎక్కవద్దని ప్యాసింజర్లకు వినీత్ అభిషేక్ విజ్ఞప్తి చేశారు.