-
ఇప్పటి వరకు 3 వేల మందికి పంపిణీ పూర్తి
-
కిట్‌తోపాటు వాడకంపై ట్రైనింగ్ ఇస్తున్న నిపుణులు
-
కిట్లు రక్షణ ఇస్తున్నాయంటున్న గీత కార్మికులు
-
తొలి దశలో ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: గీత కార్మికులను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కాటమయ్య కిట్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మూడు వేల కిట్లను గీత కార్మికులకు పంపిణీ చేసినట్లు గీత కార్మికుల కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. కిట్ల పంపిణీతోపాటు వాటిని ఉపయోగించడంపై కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్ అందజేస్తున్నారు. రూ.12 వేల విలువ కలిగిన ఈ కిట్ ను ప్రభుత్వం ఉచితంగా గీత కార్మికులకు అందచేస్తుంది. కిట్లు ఇచ్చే స్కీమ్ ను ఈ ఏడాది జులై నెలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ లో సీఎం రేవంత్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
1లక్షా 80 వేల మంది గీత కార్మికులు
రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షా 80 వేల మంది గీత కార్మికులు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీరికి కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలి దశలో నియోజకవర్గానికి 100 చొప్పున 100 నియోజకవర్గాల్లో 10 వేల కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి మూడు వేలు పంపిణీ చేయగా ఈ నెల, వచ్చే నెలలో 10 వేలు పంపిణీ చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. గత నెలలో రాష్ట్రంలో జరిగిన స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ఈ కిట్ల పంపిణీ స్టార్ట్ కాగా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. అయితే కిట్లు రెడీగా ఉన్నా కిట్ల ఉపయోగంపై ట్రైనింగ్ ఇచ్చే నిపుణులు తక్కువ మంది ఉండటంతో లేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
రెండేండ్లుగా స్టడీ
గీత కార్మికులు ప్రమాదాలకు గురవకుండా సేఫ్టీ కిట్లు ఇవ్వాలని అధికారులు రెండేండ్లుగా ప్రయత్నాలు చేస్తుండగా ఈ ఏడాది కొలిక్కి వచ్చిందని టాడీ టాపర్స్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఐఐటీ హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు.
ఐఐటీ హైదరాబాద్ నిపుణులు మిషన్ తో కూడిన కిట్ ను రిఫర్ చేశారు. దాన్ని పలు జిల్లాల్లో గీత కార్మికుల దగ్గరకు తీసుకెళ్లి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. సుమారు 4 కేజీల బరువు ఉండటంతో ఆ కిట్ ను మోయటంతో పాటు కల్లు తీసే కుండలు అదనంగా మోయాలని.. దీంతో బరువు ఎక్కువ అవడంతో పాటు అసౌకర్యంగా ఉందని గీత కార్మికులు కార్పొరేషన్ అధికారులతో చెప్పగా ఆ కిట్ ను తిరస్కరించారు.
గత పదేండ్లలో గీత కార్మికుల ప్రమాదాలు
- మృతిచెందిన గీత కార్మికులు 775
- శాశ్వత వైకల్యం పొందిన వాళ్లు 1,974
- తాత్కాలిక వైకల్యం పొందిన వాళ్లు 2,677
- మొత్తం నమోదైన కేసులు 5,450
పదేండ్లలో ఎన్నో కేసులు
రాష్ట్రంలో గీత కార్మికుల ప్రమాదాలు, మరణాలు పదేండ్ల నుంచి పెరిగాయి. కల్లు తీసే సమయంలో వాడే మోకుల ముడి ఊడిపోవటం, చెట్లు ఎక్కేటప్పుడు జారటంతో కార్మికులు కిందపడి చనిపోతున్నారు. పదేండ్లలో రాష్ట్రంలో 775 మంది గీత కార్మికులు తాటిచెట్లపైంచి కింద పడి చనిపోగా, సుమారు 2 వేల మంది శాశ్వతంగా వైకల్యం పొందారని, కార్మికులకు పరిహారంగా 65.56 కోట్లు పరిహారం అందించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం వర్షాకాలంలో జరిగాయని కార్పొరేషన్అధికారులు రిపోర్ట్ ఇచ్చారు.
కాటమయ్య కిట్ ఎంతో బాగుంది
20 రోజుల క్రితం కాటమయ్య కిట్ ను ఇచ్చారు. దాన్ని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కిట్ ను రోజూ వాడుతున్నం. మా ఊర్లో తొలి దశలో 10 మందికి ఇచ్చారు. త్వరలో అందరికీ ఇస్తామని చెప్పారు. చెట్లు ఎక్కేటపుడు దిగేటపడు ఎంతో కంఫర్ట్ గా ఉంది. కల్లు తీసేందుకు ఉపయోగించే కుండలు తగిలించిన బరువు లేదు. నడుంకు పెట్టుకునేందుకు 3 బెల్ట్ లు ఉన్నాయి. సుమారు 12 వేల విలువ కలిగిన కిట్ ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటం అభినందనీయం. సీఎం రేవంత్ రెడ్డికి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లకు ధన్యవాదాలు.
- రాములు, కాకరవాయి గ్రామం, తిరుమల లాయ పాలెం మండలం, ఖమ్మం జిల్లా