
రోజుకి పది వేల అడుగులు వేయాలి. అలాగైతే మన ఆరోగ్యం మన చేతుల్లో భద్రంగా ఉన్నట్టే. చాలామంది ఇలానే అనుకుంటారు. మరయితే ఈ విషయం సైంటిఫిక్‌గా నిరూపించారా?
వాస్తవానికి చురుకైన లైఫ్ స్టయిల్ కోసం రోజుకి నాలుగువేల అడుగులు నడిస్తే చాలు.’ అంటున్నారు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ వాళ్లు. అంటే..పదివేల అడుగుల్లో సగానికి సగం అన్నమాట. ఈమధ్య వాళ్లు పబ్లిష్ చేసిన కొత్త రీసెర్చ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. అలాగని ఎక్కువ అడుగులు నడవక్కర్లేదు అని చెప్పడంలేదు. కాకపోతే శరీరాన్ని ఎంత ఎక్కువ కదిలిస్తే అంత మంచిది. రోజులో మీరు వేసే ప్రతి వెయ్యి అడుగులు15శాతం అకాల మరణాలను నివారిస్తాయి. అలాగే హెల్త్ కోసమని కష్టమైన వర్కవుట్లు చేయక్కర్లేదు. ఎక్కువ దూరాలు నడవాల్సిన అవసరం లేదు. మామూలుగా నడిచే నడక నుంచి ఇంటి పనుల వరకు, వీటితోపాటు డాన్స్ చేయడం వల్ల కూడా హెల్దీగా ఉండేందుకు సాయపడుతుందని ఆ స్టడీ సారాంశం.
ఆ స్టడీలో పెద్దవాళ్లే ఎక్కువ
వాకింగ్ అండ్ హెల్త్’ అనే రీసెర్చ్‌లో భాగంగా ఫిజికల్ యాక్టివిటీ కింద రోజు మొత్తంలో ఎంత నడుస్తున్నారనేది స్టడీ చేశారు. ఆ స్టడీలో దాదాపు 2,25,000 కంటే ఎక్కువమంది పెద్దవాళ్లను తీసుకున్నారు. వాళ్లంతా వేరు వేరు దేశాలకు చెందిన వాళ్లు. వాళ్ల యావరేజ్ వయసు 64 ఏండ్లు ఉంది. వాళ్లలో కొందరు ఆరోగ్యవంతులు. ఇంకొందరు కార్డియోవాస్కులార్ రిస్క్ ఉన్నవాళ్లు. వీళ్ల నడక, హెల్త్ రికార్డులను దాదాపు ఏడు సంవత్సరాలు ట్రాక్ చేశారు. ఆ తరువాత వచ్చిన డాటాను విశ్లేషించారు. దాన్నిబట్టి తెలిసింది ఏమిటంటే... నడిచే వాళ్లలో మరణాల రిస్క్ బాగానే తగ్గిపోయింది. రోజుకి నాలుగువేల అడుగులు అంటే.. దాదాపు రెండు మైళ్లు నడవడం వల్ల మరణాల బారిన పడడం అనేది తగ్గిపోతుంది. అలాగే రోజుకి 2,500 అడుగులు వేసినా కార్డియోవాస్కులార్ డిసీజ్ వల్ల చనిపోయే రిస్క్ ఉండదు.
నడిస్తే.. ఆ రిస్క్ ఉండదు
ఈ ట్రెండ్స్ భౌగోళికంగా వేరు వేరు ప్రాంతాల్లో, ఆడ, మగ వాళ్లలో గమనించారు. వేరు వేరు వయసుల వాళ్లలో కొన్ని తేడాలు కనిపించాయి. పెద్దవాళ్లు అంటే 60 కంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లు రోజుకి ఆరు వేల నుంచి పదివేల అడుగులు నడిస్తే 42 శాతం మరణాల సంఖ్య తగ్గింది. అదే 7,000 నుండి13,000 అడుగులు వేసిన వాళ్లలో ఆ సంఖ్య 49 శాతంగా ఉంది.
అయితే ఈ రీసెర్చిలో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపించాయి. అవేంటంటే రీసెర్చ్‌లో పాల్గొన్న వాళ్ల సామాజిక ఆర్ధిక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే ఓవరాల్ లైఫ్ స్టయిల్లో రోజుకి ఎన్ని అడుగులు నడిచారనే దానిమీద కూడా సరైన లెక్క లేదు. ఉదాహరణకి ఎక్కువ యాక్టివ్‌గా ఉండి, దాంతోపాటు ఇతర ఆరోగ్య అలవాట్లు ఉన్న వాళ్లని తీసుకుంటే వాళ్ల జీవితకాలం ఎక్కువగా ఉంది. ఈ రీసెర్చ్‌ల్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నా... మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే సెడెంటరీ లైఫ్ స్టయిల్ అనేది ఆరోగ్యానికి హానికరం. శారీరకంగా చురుకైన జీవన విధానం గడిపే వాళ్ల ఆరోగ్యం బెటర్‌గా ఉంటుంది.
ఒక వయసు వచ్చాక ఏవో కారణాల వల్ల ఎక్కువ దూరాలు కదల్లేకపోవచ్చు. అలాంటి వాళ్లు కాస్త నడిచినా ఆరోగ్యానికి మంచిదే. అందుకే అన్ని అడుగులు... ఇన్ని అడుగులు.. అని కాకుండా ఎన్నోకొన్ని అడుగులు వేయడం ఆరోగ్యకరం అని గుర్తుపెట్టుకోవాలి. శరీరాన్ని కదల్చండి. ఆరోగ్యకరమైన అలవాట్లను లైఫ్ స్టైల్లో చేర్చుకోండి. అప్పుడు బెటర్ హెల్త్. బెటర్ లైఫ్ సొంతం అవుతుంది.