పదేండ్ల పాలన వర్సెస్ వంద రోజుల పాలన!

పదేండ్ల పాలన వర్సెస్ వంద రోజుల పాలన!
  • రాష్ట్రంలో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారమంతా ఈ అంశం చుట్టే
  • కాంగ్రెస్​ వంద రోజుల పాలనే లక్ష్యంగా బీఆర్ఎస్​, బీజేపీ అటాక్​
  • పదేండ్లలో ఏం చేశారో చెప్పాలని కౌంటర్​ అటాక్​ చేసిన కాంగ్రెస్​
  • రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాలపై బీజేపీని ఇరుకునపెట్టిన రేవంత్​
  • గ్యారంటీలు, 30 వేల ఉద్యోగాలు, రైతు భరోసాపై కాంగ్రెస్​ నేతల ధీమా
  • ఫ్రీ బస్ జర్నీ, రూ. 500 సిలిండర్​లాంటి స్కీములతో మహిళల ఓట్లు గంపగుత్తగా పడ్తాయని నమ్మకం
  • అందుకే వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమన్న సీఎం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నెల రోజులుగా మూడు ప్రధాన పార్టీల మధ్య  హోరాహోరీగా సాగిన  లోక్​సభ ఎన్నికల పోరులో కీలకమైన  ప్రజాతీర్పు సోమవారం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. తమకు 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్.. తమకు పది దాటుతాయని బీజేపీ.. 12 నుంచి 14 తెచ్చుకుంటామని బీఆర్ఎస్​ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా నిండని కాంగ్రెస్​ సర్కారును  పదేండ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ, రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్​ టార్గెట్​ చేయడం ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది.

పదేండ్ల పాలనలో ఏమి చేశామో చెప్పుకొని ఓట్లడగాల్సిన బీజేపీ, బీఆర్ఎస్​ నేతలు.. అది కాకుండా వంద రోజుల్లో కాంగ్రెస్​ ఏమి చేసిందో చెప్పాలంటూ నిలదీయడం ఆసక్తి రేపింది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి వరకు.. బీఆర్​ఎస్​లో మాజీ సీఎం కేసీఆర్​ మొదలుకొని కేటీఆర్​, హరీశ్​రావు వరకు అందరూ వందరోజుల కాంగ్రెస్​ పాలననే ప్రధానంగా టార్గెట్ ​చేశారు. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలకు సీఎం రేవంత్​రెడ్డితో పాటు మంత్రులు కౌంటర్​ ఇచ్చారు.

వంద రోజుల ప్రజాపాలనలో తాము ఐదు గ్యారంటీలు అమలు చేశామని, కోతలు లేని కరెంట్​ ఇస్తున్నామని, రైతు భరోసా వేశామని, ఆగస్టు 15కల్లా రైతు రుణ మాఫీ లాంటి హామీలను అమలు చేయబోతున్నామని ప్రతి సభలో చెప్పిన సీఎం రేవంత్​.. మరి పదేండ్ల పాలనలో మీరు ఏం చేశారో చెప్పాలని బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలను నిలదీశారు. పదేండ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్​ రూ. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిస్తే .. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అంటూ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.

బరాబర్​ఈ ఎన్నికలు వంద రోజుల పాలనకు రెఫరెండమేనని సీఎం రేవంత్​రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఇక మోదీ సర్కారు మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ చివరి పది రోజులు రేవంత్​ సాగించిన ప్రచారం  దేశవ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారింది. మొత్తం మీద రాష్ట్రంలో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారమంతా బీఆర్ఎస్​, బీజేపీ పదేండ్ల పాలన వర్సెస్​ కాంగ్రెస్​ వంద రోజుల పాలన అన్నట్లుగా సాగింది. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్​ నేతలు ప్రధానంగా కాంగ్రెస్​ వంద రోజుల పాలనను టార్గెట్​ చేశారు. కాంగ్రెస్​వల్లే కరువు వచ్చిందని, పంటలు ఎండిపోయాయని మొదట్లో బీఆర్ఎస్​ నుంచి కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు లాంటి నేతలు ఆరోపించారు. కానీ, డిసెంబర్​లో అధికారంలోకి వచ్చిన తాము కరువుకు ఎలా కారణమవుతామని సీఎం రేవంత్​ సహా మంత్రులు గట్టి కౌంటర్​ ఇయ్యడంతో బీఆర్​ఎస్​ నేతలు కరెంట్​ అంశంపై ఫోకస్​ చేశారు.

కాంగ్రెస్​ హయాంలో పవర్​కట్స్​ తీవ్రమయ్యాయని ఆరోపించడం మొదలుపెట్టారు. తాను సూర్యాపేటలో , మహబూబ్​నగర్​లో ఉండగా కరెంట్ ​పోయిందని స్వయంగా కేసీఆర్​ చెప్పగా.. అసలు ఆ సమయంలో అక్కడ కరెంటే పోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ట్రాన్స్​కో ఆధారాలతో బయటపెట్టడంతో ఈ అంశం బీఆర్​ఎస్​కు బూమరాంగ్​అయింది. దీంతో బీఆర్ఎస్​ నేతలు..  ఆరు గ్యారంటీలు సరిగ్గా అమలు కావడం లేదని, రైతు భరోసా ఇయ్యలేదని, పంట రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు నిరంతర ప్రక్రియ అని, ఎన్నికల కోడ్​ తర్వాత ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని

అర్హులందరికీ పథకాలు అందుతాయని సర్కారు అప్పటికే స్పష్టత ఇచ్చింది.  90 శాతానికి పైగా రైతుల అకౌంట్లలో రైతుభరోసా కూడా వేసింది. ఇక ఆగస్టు 15 వరకు  రూ.2లక్షల పంట రుణాలను మాఫీ చేస్తానని సీఎం రేవంత్​ ప్రతి సభలో హామీ ఇస్తూ వచ్చారు. దీంతో బీఆర్ఎస్​కు ఒకదశలో ప్రచారాస్త్రాలు కరువయ్యాయి. ఇక అవినీతిలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​ ఒకటేనని బీజేపీ నేతలు ప్రతి సభలో ఆరోపిస్తూ వచ్చారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్​ నేతలను కాంగ్రెస్​ ప్రభుత్వం కాపాడుతోందని ఫైర్​ అయ్యారు.

దీనికి సీఎం రేవంత్​రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్​ నేతలు కౌంటర్లు ఇచ్చారు. ‘‘పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా..  మరి బీఆర్​ఎస్​ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు”అంటూ బీజేపీని నిలదీశారు.  బీజేపీ, బీఆర్​ఎస్​ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనతో పాటు విద్యుత్​ కొనుగోళ్లలో అక్రమాలపై తాము అధికారంలోకి వచ్చిన ఈ వందరోజుల్లోనే  జ్యుడీషియల్​​ఎంక్వైరీ వేశామని.. ఫోన్​ ట్యాపింగ్​పై కూడా ఇన్వెస్టిగేషన్​ జరుగుతున్నదని చెప్పారు. 

గ్యారంటీలు, రుణమాఫీపై కాంగ్రెస్​ ధీమా   

వంద రోజుల్లోనే గ్యారంటీల అమలు, 30 వేల ఉద్యోగాల భర్తీ, టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన, రైతుభరోసా నిధులు రైతులకు చేరడం, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి  ప్రతి మీటింగ్​లో స్పష్టంగా ప్రకటించడం తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ ​ధీమాగా ఉంది. రైతు భరోసా, రుణమాఫీతో పాటు అకాల వర్షాలకు పంట నష్టం కింద పరిహారం అందించడం, పంటల బీమాను కూడా అమల్లోకి తీసుకురావడం లాంటి చర్యల వల్ల  రైతుల ఓట్లు తమకే పడ్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ, రూ.500కే గ్యాస్ ​సిలిండర్​తో పాటు ఎన్నికల తర్వాత అమలుచేస్తామని చెప్పిన రూ.2,500 మహాలక్ష్మి స్కీముల వల్ల మహిళా ఓటర్లంతా చెయ్యి గుర్తుకే ఓటేస్తారని ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు బీజేపీ నుంచే గట్టి పోటీ ఉంటుందని భావించిన సీఎం రేవంత్.. తన ప్రచారంలో ప్రధానంగా ఆ పార్టీనే టార్గెట్​చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బీజేపీ  400 సీట్లు అడుగుతుండడం వెనుక రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర దాగి ఉందని ఆరోపించిన ఆయన.. ఆ అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.

బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల హైదరాబాద్​కు కంపెనీలు రాకుండా పోయే ప్రమాదముందని, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్​లో పెట్టుబడులు రాకపోవడానికి ఇదే కారణమని చివరి రెండు రోజుల ప్రచారంలో గట్టిగా చెప్పారు. నిజానికి ఎన్నికల కోడ్​వచ్చేనాటికి కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర నెలలే అయింది. ఇంత తక్కువ టైంలోనే కీలకమైన గ్యారంటీలు అమలు చేయడం మొదలు పెట్టామని, దీని వల్ల జనంలో తమ పార్టీపై మరింత నమ్మకం ఏర్పడిందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేండ్ల పాలనలో దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి

ఖాళీ ఖజానాను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పజెప్పి వెళ్లిపోయిందనే విషయాన్ని జనంలోకి సీఎం రేవంత్​రెడ్డి టీమ్​ తీసుకెళ్లింది. విద్యుత్​ సంస్థలను రూ. 81వేల కోట్ల అప్పుల్లో ముంచారని, లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కుంగిపోయి పనికిరాని ప్రాజెక్టుగా మారిందని ప్రజల్లో చర్చ పెట్టగలిగారు. అదే టైంలో కొత్త సర్కారు కొలువుదీరి పట్టుమని పది రోజులు కాకముందు నుంచే

ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేసిన కామెంట్ల వల్ల కాంగ్రెస్​సర్కారుకు జనాల్లో సానుభూతి వచ్చిందని, అది కూడా తాజా ఎన్నికల్లో తమకే కలిసివస్తుందని హస్తం నేతలు నమ్ముతున్నారు.