
ఆసిఫాబాద్, వెలుగు: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంసీ రమేశ్ తీర్పునిచ్చారు. జైనూర్ సీఐ అంజన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దినకర్ సునీల్ 2021 ఆగస్టు 27న ఆటోలో 25 కిలోల 300 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా, జైనూర్ పోలీసులు పట్టుకున్నారు. సుమోటోగా కేసు నమోదు చేయగా, అప్పటి సీఐలు తిరుపతి, హనూక్ నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పీపీ జగన్మోహన్ రావు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు.