- రూ.25,500 జరిమానా కూడా
ఆసిఫాబాద్, వెలుగు : ముగ్గురి మరణానికి కారణమైన వ్యక్తికి ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దానితో పాటు రూ.25,500 జరిమానా కూడా వేసింది. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. కాగజ్ నగర్ టౌన్ సీఐ బుద్దే స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఫిబ్రవరి 25న పుల్ల కృష్ణ (25) అనే వ్యక్తి మద్యం మత్తులో వాహనాన్ని అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్నఆటోను ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఆటోలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఈస్ గాం గ్రామానికి చెందిన మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం సాక్ష్యాధారాలతో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన అనంతరం కృష్ణకు ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.25,500 జరిమానా విధించారు.