Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్

ఏపీలో పోలింగ్ జోరుగా సాగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర వందల మంది క్యూలో ఉన్నారు. ఇదే సమయంలో తెనాలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శివకుమార్ తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అప్పటికే అక్కడ భారీ క్యూ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ క్యూలో కాకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేయటానికి ప్రయత్నించారు.

ఎమ్మెల్యే అభ్యర్థి తీరుపై క్యూలో ఉన్న ఓ ఓటర్ ప్రశ్నించారు. నేరుగా వెళ్లి ఎలా ఓటు వేస్తారు.. క్యూలో రావాలి కదా అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్.. పోలింగ్ బూత్ క్యూ లైన్ లోనే ఉన్న ఓటర్ ను కొట్టాడు. చెంప చెళ్లుమనిపించాడు. ఎమ్మెల్యేకు ధీటుగా.. అంతే వేగంగా స్పందించిన ఓ సామాన్య ఓటర్.. తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థి చెంప చెళ్లుమనిపించాడు. ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న ఓటర్ పై.. అతని పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆ సామన్య ఓటర్ పై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తెనాలిలోని ఆ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

విషయం తెలిసిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడి నుంచి పంపించారు. ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన సామాన్య ఓటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.