గ్రామీణ ఆదాయం అడుగంటుతున్నది...వ్యవస్థ వైఫల్యమే ఇందుకు కారణం

రాష్ట్రంలో మొత్తం సాగుదారుల్లో 36 శాతంగా ఉన్న కౌలు రైతులకు (కనీసం 20 లక్షల కుటుంబాలు) రైతులుగా గుర్తింపు లేదు. ఆదివాసీ ప్రాంతాల పోడు రైతులకూ గుర్తింపు లేదు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. అసైన్డ్ భూములు పొందిన రైతులకు శాశ్వత భూమి హక్కులు లేక, తమ భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందనే ఆందోళన ఉంది. లక్షల సంఖ్యలో ఉన్న ఒంటరి మహిళా రైతుల, కూలీల  సమస్యలు వర్ణనాతీతం. సాపేక్షంగా కూలీ రేట్లు గతం కంటే పెరిగినా, వ్యవసాయ కూలీలకు పని దినాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ, కలుపు తీయడం లాంటి పనులలో విష రసాయనాల వినియోగం, మోనో క్రాపింగ్ వ్యవస్థ ఇందుకు ప్రధాన కారణం. వ్యవసాయ కూలీలకు సాంఘిక భద్రత(రైతు బీమా లాగా) పథకాలు కూడా లేవు. ఇంటి స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామనే ప్రభుత్వ తాజా  పథకం ఇంటి స్థలం లేని వ్యవసాయ కూలీలకు అన్యాయమే చేస్తున్నది. ప్రభుత్వం చాలా కాలంగా ఇంటి స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణ పథకాలను పూర్తిగా నిలిపి వేసింది. 

పశుపోషణ తగ్గిపోతున్నది

 స్థానిక సహజ వనరులపై గ్రామ ప్రజలందరికీ యాజమాన్య హక్కులు లేవు. పంటల సాగులో, పశు పోషణలో ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. రసాయన ఎరువులు భారీగా వాడుతున్నా , పంటల సగటు దిగుబడులు తక్కువే.  పశుపోషణ గిట్టుబాటు కాక, తగ్గిపోతున్నది. పంట సాగుతో పోల్చినప్పుడు, మేకల, గొర్రెల పెంపకంలో  నికర ఆదాయం సాపేక్షికంగా ఎక్కువే అయినా, ఈ జీవాల పోషణకు అవసరమైన ఉమ్మడి భూములు తగ్గి పోతున్నాయి. మేతకు తగిన వనరులు లేవు. పెట్టుబడికి, కుటుంబ పోషణకు ప్రైవేట్ రుణాలపై  ఆధార పడటం పెరిగింది. సంస్థాగత రుణ వ్యవస్థ వైఫల్యమే ఇందుకు కారణం. 

మద్యం జోరు ‑ విద్యావైద్యం విఫలం

ప్రభుత్వ విద్యా, వైద్య రంగాల వైఫల్యంతో ప్రైవేట్ విద్య–వైద్యం భారంగా మారింది.  ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల వైఫల్యం వల్ల సొంత ఇంటి నిర్మాణ ఖర్చు భారం కుటుంబాలపై బాగా పెరిగింది. ఫోన్, ఇంటర్నెట్, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. కుటుంబంలో అందరికీ  జీవనోపాధి దొరకక కుటుంబ ఆదాయం పెరగడం లేదు. నిరక్షరాస్యత, స్కూల్, కాలేజ్  డ్రాప్ అవుట్స్, నిపుణత, జ్ఞానం పెంచని చదువులు కూడా ఇందుకు కారణం. గ్రామీణ మగవాళ్లలో పెరిగిన మద్యం అలవాట్లు కుటుంబ ఖర్చులను గణనీయంగా  పెంచుతున్నాయి. శ్రమ జీవులలో అనారోగ్యాలను, అకాల మరణాలను పెంచుతున్నాయి. గ్రామీణ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన స్థానిక పాలనా వ్యవస్థలు,  రైతు, మహిళా, వృత్తుల వారీ ప్రజల సహకార సంఘాల పని తీరు అత్యంత బలహీనంగా ఉంది.  

వ్యవసాయ పథకాల్లో సమస్యలు

 ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ రంగ పథకాల అమలులో తీవ్ర సమస్యలు ఉన్నాయి. రైతు బంధు పథకం కింద కేవలం పట్టాకు హక్కులు కలిగిన రైతులకు మాత్రమే సహాయం అందుతున్నది.  కౌలు రైతులకు, పోడు రైతులకు అందడం లేదు. రైతు బీమా పథకం కేవలం పట్టాదారు రైతులకే మాత్రమే అమలవుతున్నది. విత్తన సబ్సిడీ పథకం గత రెండేళ్లుగా సమగ్రంగా అమలు కావడం లేదు. విత్తన ధరలు పెరిగి రైతులకు భారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కూలీల కొరత ఎదురవుతున్నా, వ్యవసాయ యాంత్రీకరణ పథకం రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సరిగా అమలు కావడం లేదు. రైతులకు పంట రుణాలపై అందించాల్సిన వడ్డీ రాయితీ గత ఎనిమిదేళ్లుగా రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు.  రైతుల నుంచి ఈ వడ్డీలను బ్యాంకులు మాత్రం వసూలు  చేస్తున్నాయి.

గ్రామీణ ఆదాయం అడుగంటుతున్నది

ఇప్పటి వరకూ గ్రామీణ కుటుంబాలకు  పంటల  అమ్మకం ద్వారా, రైతు బంధు, పీఎం  కిసాన్ లాంటి నగదు బదిలీ పథకాల ద్వారా, పాల ఉత్పత్తి కోసం పశు పోషణ ద్వారా, మాంసం ఉత్పత్తి కోసం కోళ్ళు, మేకలు, గొర్రెల పోషణ ద్వారా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వేతనం ద్వారా, వ్యవసాయం, ఇతర పనులలో దినసరి కూలీ ద్వారా, కుటుంబ సభ్యులు సాగించే వ్యవసాయేతర వృత్తుల  ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్  పథకం ద్వారా, తేనె, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్న కిరాణా వ్యాపారం, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ ద్వారా ఆదాయం పొందుతున్నారు. అయితే అన్ని కుటుంబాలకూ  అన్ని  రకాల ఆదాయాలు ఉండకపోవచ్చు.

మన ఊరు– మన ప్రణాళిక ఏమైంది?

గ్రామీణ ప్రాంతంలో వస్తున్న మార్పులపై  ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తున్న సమాచారం ఏ మాత్రం విశ్వసనీయత లేనిది.  ఏ అభివృద్ధి ప్రణాళిక సవ్యంగా రూపొందాలన్నా, గ్రామీణ కుటుంబాల  క్షేత్ర స్థాయి వాస్తవ సమాచార సేకరణ పారదర్శకంగా ఉండాలి. వాస్తవ సమాచారం ఆధారంగా మాత్రమే  గ్రామీణ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళికను  తయారు చేసుకోవాలి. గతంలో ‘మన ఊరు –మన ప్రణాళిక’ తయారు చేసి, దాన్ని ఏ మాత్రం అమలు చేయకుండా వదిలేశారు. ఇప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలతో, విస్తృత మానవ వనరుల సహకారంతో, తగిన బడ్జెట్ కేటాయింపులతో ఆ ప్రణాళికను అమలు చేయాలి. 


సంక్షేమ చట్టాల అమలే లేదు

రాష్ట్రంలో  గ్రామీణ ప్రజా సంక్షేమ చట్టాల అమలు తీరు  అధ్వానంగా ఉంది. 1973 – భూ సంస్కరణల (గరిష్ట పరిమితి) చట్టం అమలు కావడం లేదు. 2005 – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సమగ్రంగా అమలు కావడం లేదు.2006- ఆదివాసీలకు భూమిపై హక్కులను గుర్తించే అటవీ హక్కుల చట్టం సమగ్రంగా అమలు కావడం లేదు. 2006- రైతుల ఆదాయానికి భరోసా ఇచ్చే స్వామినాథన్ కమీషన్ సిఫారసులు అమలు కావడం లేదు. కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత  లేదు. 2009 విద్యా హక్కు చట్టం సమగ్రంగా అమలు కావడం లేదు.  2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు కావడం లేదు. 2013 భూ సేకరణ చట్టం సమగ్రంగా  అమలు కావడం లేదు. 2013 ఆహార భద్రత చట్టం రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం అంత్యోదయ కార్డులు అందరికీ లేవు. చట్టం చెప్పినట్లుగా చిరు ధాన్యాలు పంపిణీ కావడం లేదు. 2014 - దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి కొనుగోలు జీవో. నంబర్.1 అమలు కావడం లేదు. 2016 - వ్యవసాయదారుల రుణ విముక్తి చట్టం అమలు కావడం లేదు. 

రుణమాఫీ లేదు, రుణ లభ్యతా లేదు

2014,18 లో టీఆర్​ఎస్​ పార్టీ ఇచ్చిన రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామన్న హామీ  రెండు విడతల లోనూ సరిగా  అమలు కాక, రైతులకు అప్పుల భారమే మిగిలింది. రుణ మాఫీ హామీలు సరిగా అమలు కాక, బ్యాంకుల నుంచీ వడ్డీ రాయితీతో అందాల్సిన పంట రుణాలు పూర్తిగా తగ్గిపోయాయి. కౌలు రైతులకు అసలు బ్యాంకు రుణాలు అందడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న దశలో రాష్ట్రంలో  పంటల బీమా పథకాలు  అమలు కావడం లేదు. భారీ వర్షాలు, కరువులు, వడగండ్ల వర్షాలతో పంటలను  నష్టపోయిన రైతులకు పరిహారం (ఇన్ పుట్  సబ్సిడీ) కూడా సరిగా అందడం లేదు. ఒక్క వరి ధాన్యం తప్ప గత మూడేళ్లుగా ఇతర ఏ పంటనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కనీస మద్దతు ధరలకు  కొనడం లేదు. వరుసగా రెండు సంవత్సరాలు రాష్ట్ర హై కోర్టులో కేసు వేసిన తరువాత మాత్రమే, జొన్న పంటను కొనుగోలు చేశారు. 

 

  • కనెన్గంటి రవి,    
  • రైతు సవ్రాజయ్ వేదిక