- పెట్టుబడి సాయాన్ని పదెకరాల వరకే పరిమితం చేయాలి
- సాగులో లేని భూములకు కట్ చేయాలి
- గత ప్రభుత్వం ఎత్తివేసిన సబ్సిడీలు పునరుద్ధరించాలి.
- మంత్రివర్గ సబ్‌కమిటీ ఎదుట రైతులు
హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఎక్కువగా కౌలు రైతులే ఉంటారని, వారికి కూడా రైతు భరోసా ద్వారా సాయం అందించాలని రైతులు కోరారు. హనుమకొండ కలెక్టరేట్లో రైతు భరోసా విధివిధానాలపై ప్రభుత్వం సోమవారం అభిప్రాయ సేకరణ నిర్వహించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి 250 మంది వరకు రైతులు హాజరయ్యారు. రైతుల అభిప్రాయాల మేరకు అసెంబ్లీలో చర్చించి తగిన నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
పంటలకు పరిహారం కూడా ఇవ్వాలి
రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తి వేసి, రైతుబంధు అమలు చేసిందన్నారు. సబ్సిడీలు కొనసాగిస్తూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గుట్టలు, కొండలు, రియల్ వెంచర్లు, ఫామ్ హౌజ్‌లు, ఇతర సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ధరణి వల్ల చాలా సమస్యలు తలెత్తాయని, సాగు చేసుకుంటున్నది ఒకరైతే.. పట్టా వేరొకరి పేరు మీద ఉంటోందన్నారు.
ధరణి వల్ల చాలాచోట్ల భూములు ఉన్నా రికార్డుల్లోకి ఎక్కలేదని, ఏజెన్సీ ఏరియాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. పెట్టుబడి సాయమే కాకుండా పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, డాక్టర్ మురళి నాయక్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, షేక్ రిజ్వాన్ బాషా, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, దివాకర, ఉమ్మడి జిల్లాకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి
రైతు భరోసా పథకాన్ని పదెకరాల లోపు భూములకు మాత్రమే ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తి వేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రభుత్వం సబ్సిడీలపై దృష్టి పెట్టాలి. ఇదివరకు వైఎస్ హయాంలో వ్యవసాయం బాగా చేసిన రైతులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించేవారు. కానీ గత సర్కారు ఆ పద్ధతిని తీసేసింది. మళ్లీ ఆ విధానం తీసుకువస్తే రైతులకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది.
- సూరం బుచ్చిరెడ్డి, రైతు, దేవన్నపేట
సాగులో ఉన్న ప్రతి ఎకరాకు ఇవ్వాలి
ఫామ్ హౌజుల్లో కూర్చుని తినే వాళ్లకు కాకుండా సాగులో ఉన్న ప్రతి ఎకరాకు సాయం అందించాలి. దీన్ని పది ఎకరాలకే పరిమితం చేస్తే 50 ఎకరాలు ఉండి సాగు చేస్తున్న రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి వస్తుంది. వాణిజ్య పంటలు సాగు చేసేవాళ్లకూ రైతు భరోసా ఇవ్వాలి. ఫీల్డ్ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలి. గ్రామాలకు వెళ్లే వాటితో పాటు పొలాలకు వెళ్లే మార్గాల్లో కూడా రోడ్లు వేయాలి.
- రమాదేవి, మహిళా రైతు, గంటూరు పల్లి
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
గత ప్రభుత్వం రైతు సమస్యలను నిర్లక్ష్యం చేసింది. గత పదేండ్లలో 8 వేల మంది రైతులు చనిపోయినా అప్పటి మంత్రులు కనీసం స్పందించిన పాపానపోలేదు. పంట నష్టం జరిగితే ఫొటోలు దిగి వెళ్లడం తప్ప.. పైసా సాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ముప్పావు వంతున్న కౌలు రైతుల కోసం ఒక పాలసీ తీసుకురావాలి.
- ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ