కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వాలి

కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వాలి
  • చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వ పథకాలు అందించాలి
  • రైతు స్వరాజ్య వేదిక డిమాండ్
  • ఆత్మహత్య చేసుకున్న 20 రైతు కుటుంబాలకు రూ.40 వేల చొప్పున ఆర్థికసాయం అందజేత

తార్నాక, వెలుగు: కౌలు రైతులతో పాటు చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వ పథకాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, కొండల్ రెడ్డి డిమాండ్  చేశారు. హైదరాబాద్  తార్నాకలో రైతు ఆత్మహత్య బాధితులతో గురువారం సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేశారు.   

ఆత్మహత్య చేసుకున్న 20 మంది రైతుల కుటుంబాలకు రూరల్  డెవలప్ మెంట్  సర్వీస్  సొసైటీ సంస్థ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.40 వేల ఆర్థికసాయం అందజేశారు.  రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడంతో ఎలాంటి  ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. రైతు ఆత్మహత్య కుటుంబాలకు రావాల్సిన పరిహారం కోసం రైతు స్వరాజ్య వేదిక ఎప్పటి నుంచో పోరాడుతుందని, హైకోర్టుకు కూడా వెళ్లి విజయం సాధించామని గుర్తుచేశారు.  

గత నెలలో 141  కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చేశామన్నారు. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో చిన్న, సన్నకారు రైతులకు మేలు కలిగేలా విధానాలు రూపొందిస్తే రైతు ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. పంట బీమా పథకం, పంట నష్టపరిహారం, కౌలురైతులకు గుర్తింపు లేకుండా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. 

కౌలు రైతులకు రైతు స్వరాజ్య వేదిక అండగా ఉంటుందన్నారు.  ఆర్డీఎస్ఎస్  సంస్థ సెక్రటరీ గాడి శ్రీను, ఎంవీ ఫౌండేషన్  వెంకట్ రెడ్డి, ప్రముఖ టీవీ జర్నలిస్టు ఉమా సుధీర్, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు కన్నెగంటి రవి, కిరణ్ కుమార్, శ్రుతి పాల్గొన్నారు.