- కొత్తగూడెం మున్సిపాలిటీలో చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు
- గతేడాది రూ. 51.20 లక్షలకు ఖరారైన టెండర్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గతేడాది కొత్తగూడెం మున్సిపాలిటీలోని డైలీ మార్కెట్ టెండర్ రూ. 51.20 లక్షలకు ఫైనల్ కాగా ఈసారి రూ. 8.10 లక్షలకే ఖరారు కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనక జిల్లా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కుమ్మక్కు కావడంతోనే తక్కువ మొత్తానికి టెండర్ ఫైనల్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపాలిటికీ రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీలోని డైలీ మార్కెట్‌కు గతేడాది కూడాటెండర్ పొందిన వారు రూ. 51.20 లక్షలు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉన్నా కేవలం దాదాపు రూ. 23 లక్షలు కట్టారని, మిగిలిన మొత్తం ఇవ్వకున్నా ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీకి దాదాపు రూ.28 లక్షల మేర నష్టం వచ్చిందని తెలుస్తోంది. గతేడాది టెండర్ దక్కించుకున్న వ్యక్తి అధికార పార్టీ కౌన్సిలర్ భర్తే కావడం గమనార్హం. తాను అనుకున్న విధంగా డబ్బులు వసూలు కాకపోవడంతో మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోతున్నాననంటూ టెండర్ పొందిన వ్యక్తి కోర్టు కెళ్లాడని ఆఫీసర్లు చెప్తున్నారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా మునిసిపల్ అధికారులు రూ. 28 లక్షలు వసూలు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి.
గుట్టు చప్పుడు కాకుండా టెండర్
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలకు గానూ డైలీ మార్కెట్‌కు టెండర్‌ను జూన్ నెలలో పిలిచారు. సాంకేతిక కారణాలతో టెండర్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. నాలుగైదు రోజుల కిందట గుట్టు చప్పుడు కాకుండా తాము అనుకున్న వాళ్లకు ఆఫీసర్లు ఫైనల్ చేశారు. అతి తక్కువకు టెండర్ ఫైనల్ చేసేలా ఓ ప్రజాప్రతినిధి కొడుకు, జిల్లాలో కీలక నేత చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు సంత టెండర్‌ను నిర్వహించకుండా ఆఫీసర్లు జాప్యం చేస్తుండడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.
డైలీ మార్కెట్ టెండర్ తరహాలోనే సంత టెండర్‌ను కూడా తక్కువ మొత్తానికే తాము అనుకున్న వాళ్లకే అప్పగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. లక్షల్లో మున్సిపాలిటీకి ఆదాయం కోల్పోయే విధంగా వ్యవహరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్లక్ష్మణ్అగర్వాల్, బీఎస్పీ స్టేట్జనరల్ సెక్రెటరీ యెర్రా కామేశ్ డిమాండ్‌చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు.
టెండర్లలో అవినీతి జరిగింది
కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్వహించిన డైలీ మార్కెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయి. లాస్ట్ టైంలో రూ. 51.20 లక్షలకు టెండర్ పోతే ఈ సారి ఇంకా ఎక్కువకు పోవాలి. కానీ సగంలో సగానికి కూడా టెండర్ పోలేదు. అతి తక్కువ టెండర్‌కు ఫైనల్ చేసిన ఆఫీసర్లపై కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ విచారణ జరిపి చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడ్తాం.
వై. శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ ఫ్లోర్ లీడర్, కొత్తగూడెం మున్సిపాలిటీ
ఎవరికీ తెలియకుండా టెండర్ ఫైనల్ చేసిన్రు
డైలీ మార్కెట్ టెండర్‌ను ఎవరికీ తెలియకుండా ఆఫీసర్లు ఫైనల్ చేయడం దారుణం. మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఆఫీసర్లు వ్యవహరించారు. రూ . 8.10 లక్షలకే టెండర్‌ను ఫైనల్ చేయడంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. టెండర్ విషయమై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి.
మునిగడప పద్మ, కౌన్సిలర్, కొత్తగూడెం మున్సిపాలిటీ