ఫిబ్రవరి1న ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు

ఫిబ్రవరి1న ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టెండర్లు
  • తొలి దశలో కొడంగల్, మధిర, హుజూర్​నగర్​లో నిర్మాణం
  • ఒక్కో స్కూల్​ 25 ఎకరాల్లో, రూ.135 కోట్లు ఖర్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు. తొలి దశలో వికారాబాద్ జిల్లా కొడంగల్, ఖమ్మం జిల్లా మధిర, సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటికి విద్యాశాఖ అనుబంధ కార్పొరేషన్ అయిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) ఫిబ్రవరి 1 న టెండర్లు పిలవనుంది. టెండర్లు దాఖలుకు ఫిబ్రవరి 18 వరకు గడువు ఇచ్చి, అదే నెల 28న టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఏప్రిల్ నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టేలా టెండర్ దక్కించుకున్న సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. నియోజకవర్గంలోని గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా 20 నుంచి 25 ఎకరాల స్థలంలో, రూ. 135  కోట్లతో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్​ను నిర్మించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ కలిపి ఒకే క్యాంపస్​లో క్లాస్ రూమ్స్, హాస్టల్స్, అధికారులు, సిబ్బంది క్వార్టర్లు, గ్రౌండ్​లు ఉండనున్నాయి.

 వీటి నిర్వహణకు నాలుగు గురుకుల సొసైటీల నుంచి నిధులను ఎడ్యుకేషన్ శాఖకు బదిలీ కానున్నాయి. కాగా, రాష్ట్రంలో సీఎం, మంత్రులు , ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ క్యాంపస్​లకు శంకుస్థాపనలు చేశారు. డీపీఆర్​ల బాధ్యతలు బెంగళూరుకు చెందిన మనోజ్ అసోసియేట్స్​కు అప్పగించగా వారు రెడీ చేసి కార్పొరేషన్​కు అందజేశారు. వీటిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం పరిశీలించి పలు మార్పులను సూచించారు. సీఎం సూచన మేరకు మార్పులను కూడా అధికారులు పూర్తి చేసినట్లు తెలిసింది.