ఎస్​హెచ్​జీ సోలార్ ​ప్లాంట్లకు..త్వరలో టెండర్లు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎస్​హెచ్​జీ సోలార్ ​ప్లాంట్లకు..త్వరలో టెండర్లు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • మహిళా సంఘాల ద్వారావెయ్యి మెగావాట్ల సోలార్ ​పవర్ ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి
  • ప్లాంట్ల కోసం ప్రతి జిల్లాలో150 ఎకరాల భూసేకరణ
  • ఎంఎస్​ఎంఈల ఏర్పాటుకుప్రతి నియోజకవర్గంలో4  నుంచి 5 ఎకరాలు
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్వయం సహాయక సంఘాల​(ఎస్​హెచ్​జీ) ద్వారా నిర్వహించబోయే సోలార్​ పవర్ ప్లాంట్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్​పవర్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేల ఎకరాలు సేకరించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

బుధవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని తమ ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాల చేతికి పెద్దమొత్తంలో డబ్బు వస్తున్నందున.. వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని సూచించారు.

ముఖ్యంగా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని తెలిపారు. దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని.. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు.

సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతుల పైన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టలతో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయని.. వాటి పైన సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని విద్యుత్​ శాఖ అధికారులకు సూచించారు. వీటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  

పీఎం కుసుమ్​ స్కీంలో రైతులకు సోలార్​ పవర్..​

పీఎం కుసుమ్​పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడిందని.. ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం ఆదేశించారు. టీజీ రెడ్కో పోర్టల్ ద్వారా రైతులు సోలార్ పవర్ ఉత్పత్తికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని.. దీని ద్వారా తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి రావడమే కాకుండా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,  గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఎస్​ఎంఈలకు 4 నుంచి 5 ఎకరాలు..

ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 4 నుంచి 5 ఎకరాల భూమి అవసరం అవుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. చిన్నపాటి ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని ఆదేశించారు. వీటిల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.  

రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా.. ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడంలేదని ఆయన తెలిపారు. ఇక నుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నింటిని సమన్వయం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించాలన్నారు.  అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో భూములపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.