గ్రేటర్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణకు త్వరలో టెండర్లు.. లైట్లు వెలగకపోతే వెంటనే యాక్షన్​

గ్రేటర్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణకు  త్వరలో టెండర్లు.. లైట్లు వెలగకపోతే వెంటనే యాక్షన్​
  •  కొత్తగా వేసే టెండర్లలో పలు షరతులు.. 
  • ఏడేండ్లుగా మెయింటెయిన్​చేస్తున్న ఈఈఎస్ఎల్
  • రెండేండ్లుగా నిర్వహణను పట్టించుకోవట్లే.. 
  • ఈ నెల 20తో ముగిసిన కాలపరిమితి


హైదరాబాద్ సిటీ, వెలుగు:  గ్రేటర్ లో స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ కోసం బల్దియా టెండర్లు వేసేందుకు సిద్ధమైంది. సిటీలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను ఏడేండ్ల కోసం ఈఈఎస్ ఎల్(ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ ) సంస్థకు అప్పగించింది. నిర్వహణ కోసం ఈ ఏజెన్సీకి నెలకి రూ.8 కోట్లు చెల్లిస్తోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్20న ఈ ఏజెన్సీ గడువు ముగిసింది. 

అయితే, ఈ సంస్థ రెండేండ్లుగా స్ట్రీట్​లైట్ల నిర్వహణను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థ సరిగ్గా పనిచేయడం లేదని బల్దియా రూ.6.50 కోట్ల ఫైన్లు కూడా వేసింది. అయినా మార్పు రాకపోవడంతో కొత్తగా టెండర్లు వేయాలని నిర్ణయించారు. కొత్తగా వేసే టెండర్లలో పలు షరతులు  పెట్టనున్నారు. అగ్రిమెంట్ లో లైట్లు వెలగకపోతే ఆ సంస్థపై యాక్షన్ తీసుకుంటారు.  

పదేండ్లలో వెయ్యి కోట్ల ఖర్చు....

గ్రేటర్ లో 9,103 కిలోమీటర్ల రోడ్లుండగా, 5,45.484  స్ట్రీట్​లైట్లున్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా మెయిన్​రోడ్లు, వీధుల్లో ఉండగా, 54 వేలకుపైగా లైట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో పాటు హైమాస్ట్ లైట్లు 6,531ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రేటర్ లో రూ.217.12 కోట్లతో జీహెచ్ఎంసీ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకి అప్పగించింది. మెయింటెనెన్స్ కోసం ప్రతినెలా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన చూస్తే కొత్త ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో  పాటు నిర్వహణ  కోసం పదేండ్లలో వెయ్యి కోట్లకి పైగా ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చయినా  లైట్ల సమస్య తీరలేదు. ప్రస్తుతం కూడా గ్రేటర్ లో 30 శాతానికిపైగా లైట్లు వెలగడంలేదు.  

 లైట్ల నిర్వహణకు ప్రత్యేక యాప్

స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం త్వరలో ‘స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్’ యాప్ ని అందుబాటులో తీసుకురాబోతున్నారు. సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ప్యానల్స్, లైట్లు, పోల్స్ వంటి అన్ని ఆస్తుల వివరాలను నమోదు చేసి పనితీరును యాప్​ద్వారా ట్రాక్ చేయనున్నారు. ఎక్కడైనా స్ట్రీట్ లైట్లు పని చేయకపోతే తక్షణమే గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. 

ఈ యాప్​ద్వారా ఇంజినీర్లు, ఎలక్ట్రీషియన్లు స్ట్రీట్ లైట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రూపొందించారు. స్ట్రీట్ లైట్ల ఆడిట్, డేటా ఎంట్రీ, రిపేర్ల నిర్వహణ తదితర అంశాలపై  ఇప్పటికే అధికారులకు ఓ దఫా శిక్షణ కూడా ఇచ్చారు. టెండర్లు పూర్తయిన తరువాత కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.