ట్రిపుల్ఆర్ సౌత్ డీపీఆర్ కు టెండర్లు... వచ్చే నెల 16 వరకు గడువు

  • సౌత్ పార్ట్ ను  సొంతంగా నిర్మించనున్న ప్రభుత్వం
  • మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్  నుంచి నల్గొండ జిల్లా వరకు సౌత్ పార్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్  (ఆర్ఆర్ఆర్) సౌత్ పార్ట్  డీపీఆర్  కోసం ఆర్ అండ్ బీ (నేషనల్ హైవేస్ ) వింగ్  టెండర్లు ఆహ్వానించింది. సోమవారం నుంచి తెలంగాణ వెబ్ సైట్ నుంచి టెండర్లను డౌన్ లోడ్  చేసుకోవాలని నోటిఫికేషన్  లో పేర్కొంది. దీనికి వచ్చే నెల 16 వరకు గడువు విధించింది. ప్రాజెక్టు కన్సల్టెంట్  ఎంపికకు ప్రభుత్వం పలు అర్హతలను ఖరారు చేసింది.

సుమారు 500 కి.మీ హైవేలకు డీపీఆర్  రెడీ చేసిన అనుభవంతో పాటు రూ.వేల కోట్లలో రోడ్లు నిర్మించిన అనుభవం ఉండాలని తెలిపింది. బిడ్లు దాఖలు చేసిన తరువాత ప్రీ బిడ్  మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఖరారు చేసిన అర్హతలు ఉన్నాయో లేవో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. నార్త్,  సౌత్  రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో నార్త్ పార్ట్ కు  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్  హైవేస్ హోదా ఇచ్చింది. 

189 కి.మీ నాలుగు జిల్లాలు

ఉమ్మడి  మెదక్  జిల్లాలోని సంగారెడ్డి నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్ పల్లి మీదుగా మహబూబ్ నగర్ లోని ఆమనగల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం నుంచి నల్గొండ జిల్లా చౌటుప్పల్  వరకు మొత్తం 189 కి.మీ విస్తీర్ణంలో త్రిపుల్ ఆర్  సౌత్ పార్ట్ ను నిర్మించనున్నారు. మొత్తం 8 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాల మీదుగా సౌత్  పార్ట్  వెళ్లనుంది. ఈ ప్రాజెక్టును రాష్ర్ట ప్రభుత్వమే సొంతంగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం సంబంధిత జిల్లాల్లో  అధికారులు సర్వే చేస్తున్నారు. 4 వేల ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

భూసేకరణతో  పాటు ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.18 వేల కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను జైకా, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తో చర్చలు జరుపుతున్నామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే తెలిపారు. ఈపీసీ, బీవోటీ ( బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ ) పద్ధతిలో కాకుండా హైబ్రిడ్  యాన్యుటీ మోడల్ (హామ్ ) పద్ధతిలో సౌత్ పార్ట్ ను ప్రభుత్వం నిర్మించనుంది. ప్రాజెక్టు వ్యయంలో  40 శాతం టెండర్ దక్కించుకున్న కంపెనీకి రాష్ర్ట ప్రభుత్వం పలు వాయిదాల్లో నిధులు చెల్లించనుంది. భవిష్యత్తులో ఈ రోడ్ల నుంచి వచ్చే టోల్  ఆదాయాన్ని కంపెనీ, రాష్ర్ట ప్రభుత్వం తీసుకోనున్నాయి.

భూసేకరణ ప్రాసెస్ షురూ

త్రిపుల్  ఆర్  సౌత్  పార్ట్  భూసేకరణ ప్రక్రియ షురూ అయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో త్రిపుల్ ఆర్  అలైన్ మెంట్ కు అధికారులు మార్కింగ్  వేస్తున్నారు.  ప్రాథమికంగా నిర్ధారించిన వివిధ ప్రాంతాల్లో మార్కింగ్  పనులు ప్రారంభించారు.