మోడీకి టీమిండియా జెర్సీ బహుకరించిన సచిన్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?

మోడీకి టీమిండియా జెర్సీ బహుకరించిన సచిన్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?

భారత్‍లో మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. మహా శివుడి థీమ్‍తో ఉత్తర ప్రదేశ్‍లోని వారణాసి(కాశీ)లో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రికెట్ స్టేడియానికి నేడు(సెప్టెంబర్ 23) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా మరికొందరు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారు.

స్టేడియం శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన మోదీ.. మహాదేవుడి నగరంలో నిర్మించే ఈ స్టేడియాన్ని మహాదేవుడికే అంకితమిస్తున్నాం అని ప్రకటన చేశారు. అనంతరం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌.. ప్రధాని మోదీకి ఓ కానుక ఇచ్చారు. నమో అని రాసి ఉన్న టీమిండియా జెర్సీని సచిన్.. మోడీకి అందజేశారు. ఆ సమయంలో కార్యక్రమానికి హాజరైన వారందరూ ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మహా శివుడి ప్రేరణతో

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ(వారణాసి)లో మహా శివుడి ప్రేరణతో ఈ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం డూమ్.. ఢమరుకం షేప్‍లో ఉండనుండగా, ఫ్లడ్ లైట్స్ శివుడి త్రిశూలం ఆకారంలో, ఎంట్రెన్స్ డిజైన్ బిల్వ పత్రంలా రూపొందించనున్నారు. అలాగే, స్టేడియం రూఫ్ నెలవంక ఆకారాన్ని పోలి ఉండనుంది.

దాదాపు 450 కోట్ల వ్యయంతో సుమారు 30 ఎక‌రాల్లో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 30వేల మంది ఈ స్టేడియం సామ‌ర్థ్యం. డిసెంబ‌ర్ 2025లోపు ఈ స్టేడియం నిర్మాణం పూర్తికానుంది. కాగా, యూపీలో కాన్పూర్, ల‌క్నో తరువాత ఇది మూడ‌వ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం.