- టెన్నిస్కు రఫెల్ నడాల్‌గుడ్‌బై.. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్
- డేవిస్ కప్ ఫైనల్స్ చివరి మ్యాచ్
- 22 గ్రాండ్‌స్లామ్స్‌తో దిగ్గజాల సరసన చోటు
మాడ్రిడ్: టెన్నిస్ లెజెండ్, స్పెయిన్ స్టార్ రఫెల్ నడాల్.. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే నెలలో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు తన వీడ్కోలు ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నేను కోరుకున్న ప్రతి కల నెరవేరింది. ఆటలో అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు చాలా ఉత్తమమైన విధానాలను అనుసరించాననే సంపూర్ణ మనశ్శాంతితో ప్రొఫెషనల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. గత రెండేళ్లుగా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నా. పరిమితులు లేకుండా ఆడే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఈ కష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇది తీసుకోవడానికి కూడా కొంత సమయం పట్టింది. జీవితంలో ప్రతి దానికి ప్రారంభం, ముగింపు ఉంటాయి’ అని నడాల్ పేర్కొన్నాడు.
బిగ్–3గా రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌తో సమంగా టెన్నిస్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన 38 ఏళ్ల నడాల్.. గత రెండేళ్ల నుంచి నడుం, పొత్తి కడుపు గాయాలతో ఇబ్బందిపడ్డాడు. వీటి నుంచి కోలుకుని చివరిసారి పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన అతను రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఇక 2001లో ప్రొఫెషనల్‌గా మారిన నడాల్ 2005లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి టెన్నిస్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కెరీర్ మొత్తంలో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు.
క్లే కోర్టు రారాజుగా వెలుగొందిన ఈ స్పెయిన్ స్టార్ 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు మెన్, విమెన్ ప్లేయర్లు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. ఇక నడాల్ ఖాతాలో రెండు ఆస్ట్రేలియా ఓపెన్, రెండు వింబుల్డన్, నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. టోర్నీ ఏదైనా ఫెడరర్, నడాల్, జొకోవిచ్ మధ్య త్రిముఖ పోటీ ఉండేది. జొకో, నడాల్ మధ్య 60 మ్యాచ్‌లు జరిగితే ముఖాముఖి రికార్డు 31–29గా ఉంది. సెమీస్‌లో మాత్రం నడాల్ 5–4తో ముందంజలో ఉన్నాడు. ఫెడరర్‌తో 40సార్లు తలపడితే నడాల్ 24–16 ఆధిక్యంలో ఉన్నాడు. సెమీస్‌లోనూ 6–3తో లీడ్‌లో ఉన్నాడు.