IPL 2024: RCB ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టండి.. బీసీసీఐకి భారత టెన్నిస్ స్టార్ విజ్ఞప్తి

IPL 2024: RCB ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టండి.. బీసీసీఐకి భారత టెన్నిస్ స్టార్ విజ్ఞప్తి

ఐపీఎల్ టోర్నీలో మిగిలిన 9 జట్ల సంగతి ఒకలా ఉంటే.. ఆర్‌సీబీ టీమ్ పరిస్థితి మరోలా ఉంది. ఎప్పటిలానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఈ ఏడాది ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడి పోయింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. 6 అపజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.  లీగ్ దశలో వారింకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. అన్నింటా విజయం సాధిస్తే తప్ప ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. కాదు.., కూడదు.. టీ20 క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు అనుకున్నా.. ఏడింట ఒక విజయాన్ని అందుకున్న జట్టు.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో గెలుస్తుందంటే నమ్మే పరిస్థితులు లేవు. దీంతో ఆ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. 
 
ఆర్‌సీబీ జట్టు ప్రదర్శనను అన్ని రంగాల క్రీడాకారులు విమర్శిస్తున్నారు. జట్టు ఎంపిక సరైన విధంగా లేదని, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడంలో యాజమాన్యం విఫలమైందనే విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ టీమ్‌ను మరొకరికి విక్రయించాలని భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి.. బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. అందుకు చొరవ తీసుకోవాలని టెన్నిస్ స్టార్.. బీసీసీఐ పెద్దలను కోరారు.    

also read : పాండ్య స్థానానికి దూబే ఎసరు.. ఆసక్తికరంగా ఆల్ రౌండర్ స్పాట్ 

ప్రస్తుతం ఆర్‌సీబీ టీమ్ పరిస్థితి విషాదకరమని పేర్కొన్న మహేష్ భూపతి.. సరైన యాజమాన్యం చేతుల్లోకి బెంగళూరు జట్టు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రికెట్ (ఐపీఎల్ టోర్నీ) కోసమైనా బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. భారత టెన్నిస్ దిగ్గజం లేవనెత్తిన ఈ అంశాన్ని.. అ జట్టు అభిమానులు, కీడా ప్రముఖులు సమర్థిస్తుండటం గమనార్హం.

బెంగళూరు గడ్డపై రికార్డుల మోత

సోమవారం(ఎప్రిల్ 15) జరిగిన మ్యాచ్ లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాటర్ల ఊచ‌కోతకు రికార్డులు మోక‌రిల్లాయి. ఆరెంజ్ ఆర్మీ బ్యాట‌ర్లు ట్రావిస్ హెడ్(102), హెన్రిచ్ క్లాసెన్(69)ల బౌండ‌రీల ప్రవాహానికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం త‌డిసిముద్దైంది. స‌న్‌రైజ‌ర్స్ హిట్ట‌ర్ల దెబ్బకు  ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డు బ‌ద్ధలవ్వగా.. సొంత మైదానంలో గెలుపు రుచి చూడాల‌నుకున్న ఆర్‌సీబీ అభిమానులకు గుండెకోత మిగిలింది. భారీ ఛేదనలో దినేశ్ కార్తిక్(81), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62)లు శక్తికి మించి రాణించి.. జట్టు ఘోర పరాజయం పాలు కాకుండా అడ్డుకున్నారు. ఇదే ఆ జట్టు అభిమానులకు అంతో ఇంతో సంతోషించదగ్గ విషయం.