ఆదుకుంటామని మాటిచ్చి మరిచిన సర్కార్

  •     గత జూలై​లో పెద్దపల్లి జిల్లాలో భారీ వరద
  •     18 ఇండ్లు పూర్తిగా, 591 ఇండ్లు పాక్షికంగా ధ్వంసం
  •     7,485 ఎకరాల్లో పంట నష్టం

పెద్దపల్లి, వెలుగు: భారీ వర్షాలతో కాళేశ్వరం బ్యాక్ వాటర్​కారణంగా గతేడాది జూలైలో పెద్దపల్లి జిల్లాలోని గోదావరి, మానేరు పరివాహక గ్రామాలు పదుల సంఖ్యలో నీట మునిగాయి. పంటలు, ఇండ్లు ధ్వంసం కావడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మంథని ప ట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. స్పందిం చిన సర్కారు నష్టాన్ని అధికారులతో అంచనా వేయిం చారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎవరికీ రూపాయి పరిహారం అందలేదు.

రిపోర్టులు బుట్టదాఖలు..

జూలై 9 నుంచి 16 మధ్య వచ్చిన వరదలతో పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, రామగుండం, ఓదెల మండలాలతోపాటు మంథని పట్టణం సగానికి పైగా నీట మునిగింది. బిల్డింగులు గ్రౌండ్ ఫ్లోర్ వరకు  నీట మునగడంతో పట్టణ ప్రజలను వారం పాటు షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. వరదలు తగ్గు ముఖం పట్టినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలతో మండల స్థాయి అధికారులు పర్యటించి నామమాత్రంగా రిపోర్టులు తీసుకొనిపోయారు. ఆర్నెల్లు గడిచినా స్పందన లేదని, అధికారులు రిపోర్టులు బుట్ట దాఖలు చేశారని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కూలిన ఇండ్లు..

వరదల కారణంగా పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 18 ఇండ్లు పూర్తిగా కూలిపోగా, 591 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ పరంగా పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.5,200, పూర్తిగా కూలిపోయిన వాటికి రూ.95,100 సాయాన్ని ఇవ్వాల్సి ఉంది. మంథనిలో మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్, బట్టలు, కిరాణ, బుక్​స్టాల్స్, ఎలక్ట్రికల్ షాపులు నీట మునుగడంతో లోపల ఉన్న మెటీరియల్ తడిసిపోయి పనికికాకుండా పోయాయి. వీరంతా లక్షల్లో నష్టపోయారు. అధికారులు దానిపై ఎలాంటి నివేదికలు తీసుకోలేదు. జిల్లాలోని 142 గ్రామాల పరిధిలో 7,485 ఎకరాల్లో 4796 మంది రైతులకు చెందిన పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. 46 గ్రామాల పరిధిలో 556 మంది రైతులకు చెందిన 1000 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు అధికారులు చెబుతున్నా.. దానికి పది వంతుల పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

కనీసం డబుల్​ ఇల్లయినా ఇవ్వండి

అన్నారం బ్యాక్ వాటర్​తో మంథని పట్టణం పూర్తిగా మునిగింది. అప్పుడే మా ఇల్లు కూలిపోయింది, సర్కార్​ సాయం చేస్తామని చెప్పింది కానీ ఒక్క పైసా కూడా ఇయ్యలే. ఆరు నెలలైనా ఏ ఒక్కరూ మా గురించి పట్టించుకోవడం లేదు. కూలిపోయిన ఇండ్లకు నష్ట పరిహారం ఇయ్యలేదు. కనీసం డబుల్​బెడ్​రూం ఇల్లయినా ఇయ్యండ్రి. - గడి సక్కమ్మ, పోచమ్మ వాడ, మంథని

మునిగిన పంటకు రూపాయి ఇయ్యలే

నేను ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసిన. వరదలకు మొత్తం కొట్టుకపోయింది. చేతికి గింజ కూడా రాలే. అధికారులు నష్ట పరిహారం ఇప్పిస్తామని చెప్పి ఆరు నెల్లయింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలే.  - నరేష్​, గుంజపడుగ, పెద్దపల్లి