
- ఉద్యమంలో లేనోళ్లకే పార్టీలో, ప్రభుత్వంలో పదవులు
- ఓయూలో 20 మందికిపైగా పదవులు.. కేయూ నుంచి ఒక్కరికే ఇచ్చిన్రు
- మమ్మల్ని పట్టించుకోకుంటే మా దారి మేం చూస్కుంటం
- ఉమ్మడి వరంగల్ బీఆర్‍ఎస్వీ నేతల హెచ్చరిక
వరంగల్, వెలుగు: ‘‘తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతయ్. జీవితాల్లో వెలుగులు వస్తయ్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతయ్. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని ఉద్యమంలో తెగించి కొట్లాడినం. కొత్త రాష్ట్రం వచ్చాక స్టూడెంట్స్ జాక్ నుంచి ఉద్యమ పార్టీలోనే చేరినం. పార్టీ అభివృద్ధి కోసం, ఎన్నికల్లో నేతల గెలుపు కోసం గల్లీగల్లీ తిరిగినం. కానీ, బీఆర్‍ఎస్ నేతలు మమ్మల్ని కూరల్లో కరివేపాకులా వాడుకుంటున్నారు. పదేండ్లుగా అవమానాలే మిగిలినయ్. పార్టీ పెద్దలు ఇప్పటికైనా కేయూ ఉద్యమ నేతలను పట్టించుకోవాలే” అని బీఆర్‍ఎస్ స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి వరంగల్ బీఆర్‍ఎస్వీ నేతలు చెప్పారు. 24 గంటల్లోగా ఏదో ఒక ప్రకటన చేయాలని, లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్‍ఎస్వీ నేతలు పాలమాకుల కొంరయ్య, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, కందుకూరి ప్రభాకర్, మాచర్ల శరత్‍చంద్ర, జెట్టి రాజేందర్, మేడారపు సుధాకర్ మాట్లాడారు. ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ వచ్చాక బీఆర్‍ఎస్ పార్టీకి ఎంతో సేవ చేశామన్నారు. అయినా కేయూ ఉద్యమకారులుగా తమకు అన్యాయమే జరిగిందని వాపోయారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 20 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నామినేటేడ్ పదవులు ఇస్తే.. కేయూ నుంచి వికలాంగుల కోటాలో వాసుదేవ రెడ్డికి తప్పించి ఏ ఒక్కరినీ పట్టించుకోలేదన్నారు. ఉద్యమంలో లేనివాళ్లు, పార్టీతో ఇన్నాళ్లు సంబంధం లేకుండా వలసవచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. ఉద్యమ పార్టీలో తమకు ఇంత వివక్ష, అవమానం జరుగుతుందని ఊహించలేదన్నారు. తమకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత మొదలు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇతర ఎమ్మెల్యేలకు పదులసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ సిటీలో జన్ను నిషాంత్ వంటి ఉద్యమకారులు చనిపోతే కనీసం నివాళులు అర్పించడానికి కూడా సొంత పార్టీ ప్రజాప్రతినిధులు రాలేదని ఫైరయ్యారు.
స్పందించకుంటే ఎమ్మెల్యేలకు వ్యతిరేక యాత్రలు
కేయూ ఉద్యమకారులకు పదవుల కేటాయింపు, ఇతరత్రా సమస్యలపై పార్టీ పెద్దలు 24 గంటల్లోగా స్పందించి న్యాయం చేయాలని బీఆర్‍ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేస్తామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో ఊరూవాడను ఏకం చేసేలా 2009 నవంబర్ 23న కేయూలో భారీ బహిరంగ సభ నిర్వహించామని, ఇప్పుడు పార్టీ పెద్దలు తమ డిమాండ్లపై స్పందించకుంటే వచ్చే నవంబర్ 23న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేయూలో మరో సభ నిర్వహిస్తామని తెలిపారు.
కేయూలో పీహెచ్‍డీ అక్రమాలు నిజమే
కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‍డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగినమాట వాస్తవేమనని బీఆర్‍ఎస్వీ నేతలు తెలిపారు. పీహెచ్‍డీ బాధితుల్లో తమలోనూ చాలా మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టియే అధికారంలో ఉంది కాబట్టి మిగతా స్టూడెంట్ యూనియన్ల మాదిరి తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్టూడెంట్ నేతలు అరూరి రంజిత్, కలకొండ అవినాష్, దామెర రాజ్‍మనోజ్, నూటెంకి సతీశ్, నాగరాజ్, నగేశ్, వేముల లక్ష్మణ్. గుర్రాల సుమన్ రెడ్డి, మోటె చిరంజీవి, సుధామల్ల విష్ణువర్ధన్ పాల్గొన్నారు.