క్షణక్షణం భయం భయం.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన

క్షణక్షణం భయం భయం.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన

అచ్చంపేట/అమ్రాబాద్​, వెలుగు: ఎస్‌‌ఎస్‌‌బీసీ టన్నెల్‌‌ ప్రమాదం షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు అక్కడ ఇన్నాళ్లూ పనిచేసిన కార్మికులు. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా, లోపల చిక్కుకున్న ఎనిమిది మంది గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తమ వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు సన్నగిల్లుతుండడంతో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది.

షెడ్ల వద్ద అంతా సైలెన్స్‌‌

ఎస్‌‌ఎల్‌‌సీబీ టన్నెల్‌‌లో పనిచేస్తున్న కార్మికులు ఉండే నివాసాల వద్ద నిశ్శబ్ధం నెలకొంది. ఎవరిని చూసినా, పలుకరించినా భయం, ఆందోళనే కనిపిస్తున్నాయి. ఎవరూ ఎవరితోనూ సరిగా మాట్లాడుకోకుండా, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదంలో గల్లంతైన తమ వారిని తలుచుకొని బాధపడుతున్నారు.

క్షణం ఆలస్యమైనా తాము కూడా టన్నెల్‌‌లో చిక్కుకుపోయేవారమంటూ వాపోతున్నారు. అయితే టన్నెల్‌‌లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు రావాలని కాంట్రాక్ట్‌‌ సంస్థ కోరగా వీరు నిరాకరించినట్లు సమాచారం. ఎవరిని అడిగినా ఇక ఇక్కడ పనిచేసే ఆలోచన లేదని, మరో రెండు, మూడు రోజుల్లో తమ సొంతూళ్లకు వెళ్లిపోతామని చెబుతున్నారు.

దేశం నలుమూలల నుంచీ వచ్చిన కార్మికులు

ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ పనులు ఇటీవల పునఃప్రారంభం కావడంతో జార్ఖండ్‌, బిహార్‌‌, మధ్యప్రదేశ్‌‌, ఉత్తరప్రదేశ్‌‌, హరియాణా రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్‌‌ ఇంజినీర్లు, మెషీన్‌‌ ఆపరేటర్లు, హెల్పర్లు, డ్రైవర్లు, ఇతర కార్మికులు వచ్చారు. వీరంతా సుమారు 300 మంది వరకు ఉండగా, స్థానికంగా దోమలపెంట, వటవర్లపల్లి, సార్లపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు మరో 20 మంది వరకు ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఫ్యామిలీస్‌‌తో కాకుండా ఒంటరిగా వచ్చి టన్నెల్‌‌లో పనులు చేస్తున్నారు. కాంట్రాక్ట్‌‌ దక్కించుకున్న సంస్థ టన్నెల్‌‌కు కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన టన్నెల్‌‌ క్యాంప్‌‌ ఆఫీస్‌‌ వద్ద రేకుల షెడ్లను నిర్మించింది. ఇందులో కార్మికులు ఉంటున్నారు. 

ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు 

మా ప్రాణాలపై మాకు తీపి ఉంటుంది. మా బతుకులకు గ్యారంటీ లేని చోట మేం ఎలా పనిచేయాలి. ఇక ఇక్కడ పని చేసే ప్రసక్తే లేదు. రెండు, మూడు రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. 
- దీపక్‌‌సాహు, కార్మికుడు, జార్ఖండ్‌