- విచారణ పేరుతో రోజుకో కార్పొరేటర్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
- కరీంనగర్‌లో ఇటీవలఇద్దరు కార్పొరేటర్ల అరెస్ట్
- మరో ఇద్దరిని విచారించి వదిలేశారు
- సిటీలో భూకబ్జా ఫిర్యాదులు 520పైనే
- అక్రమార్కుల్లో టెన్షన్.. కాళ్ల బేరాలకు దిగుతున్న వైనం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో విచారణ పేరుతో పోలీసులు పలువురు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. రెండు రోజుల్లో ఇద్దరిని విచారించడంతో నెక్ట్స్ ఎవరోనన్న టెన్షన్ కార్పొరేటర్లు, ఇతర లీడర్లలో నెలకొంది. సిటీలో భూకబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ అక్రమాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు.. ఇప్పుడు వందల్లోకి చేరుకున్నాయి.
14 రోజుల్లో బాధితుల నుంచి రికార్డు స్థాయిలో 520 ఫిర్యాదులు వచ్చాయంటే కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల భూకబ్జాలు, ఇళ్లు, కాంపౌండ్ల కూల్చివేతలు, అమాయకులపై దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వచ్చిన ఫిర్యాదుల్లో కరీంనగర్ సిటీ, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోనివే ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఫిర్యాదులపై ఏసీపీల నేతృత్వంలో ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలతోపాటు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదులు రాగా వీరిలో ఆరుగురు మాత్రం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే అరెస్టయ్యారు. మరో ఇద్దరిని మూడు రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాక ఏ క్షణమైనా వారిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
బాధితులకు టోకెన్ ఇస్తున్న పోలీసులు..
కరీంనగర్ లో 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావు అరెస్ట్ తర్వాత భూబాధితులకు పోలీసులపై విశ్వాసం కలిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిల్లా పర్యటనలో భూకబ్జాలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. దీంతో చాలా ఏళ్లుగా పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు సీపీ అభిషేక్ మహంతిని ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజుకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తుండడంతో వీటిని ఎంక్వైరీ చేయడం కూడా పోలీసులకు ఇబ్బందిగా మారింది.
స్టేషన్ లో ఒక కంప్లయింట్ పై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయకముందే మరో ఐదారు అందుతున్నాయి. ఒకేసారి ఫిర్యాదులన్నింటిపై విచారణ చేయడం కుదరక బాధితులకు టోకెన్స్ ఇస్తున్నారు. ధైర్యంగా ఉండాలని పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపుతున్నారు. ఒక కార్పొరేటర్ లేదా లీడర్, రియల్టర్ పై వచ్చిన ఫిర్యాదులన్నింటిని కలిపి ఒకేసారి విచారిస్తున్నారు. ఆడియో, వీడియో, కాల్ డేటా లాంటి ఆధారాలు సేకరించాక నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. భవిష్యత్‌లో కేసు వీగిపోకుండా, త్వరగా బెయిల్ రాకుండా, బాధితులకు న్యాయం జరిగేలా ఎఫ్ఐఆర్, చార్జీషీట్లను సిద్ధం చేస్తున్నారు.
ఆధారాల సేకరణలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ..
భూకబ్జాలకు సంబంధించిన ఫిర్యాదుల విచారణలో భాగంగా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులతోపాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీలో లింక్ డాక్యుమెంట్లను ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పరిశీలిస్తోంది. ఫిర్యాదుల్లో పట్టా భూములతోపాటు పార్కు స్థలాలు, రోడ్లు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ ఆఫీసుల్లోని పాత రికార్డులను తిరగేస్తున్నారు.
కార్పొరేటర్ల కాళ్ల బేరం..
ఓ వైపు పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో కార్పొరేటర్లు గతంలో తాము దౌర్జన్యానికి, బెదిరింపులకు దిగిన బాధితులతో కాళ్ల బేరానికి దిగుతున్నట్లు తెలిసింది. గతంలో తాము ఇన్వాల్వ్ అయిన పంచాయితీల్లో ఇక మీదట జోక్యం చేసుకోబోమని హామీ ఇస్తున్నట్లు సమాచారం. గాంధీ చౌక్ సమీపంలోని ఓ డివిజన్ కార్పొరేటర్ కొన్నాళ్ల కింద తాను ఆక్రమించిన ల్యాండ్ ను తిరిగి బాధితులకు ఇచ్చేసినట్లు తెలిసింది. ముగ్గురికి మూడు భాగాలు చేసి తానే హద్దులు పాతి అప్పగించినట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కొందరు పెద్దల సమక్షంలో అంగీకారానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
పోలీస్ కస్టడీకి కార్పొరేటర్ జంగిలి సాగర్..
భూకబ్జా కేసులో ఇటీవల అరెస్టయి కరీంనగర్ జైలులో రిమాండ్ లో ఉన్న 21వ డివిజన్ (సీతారాంపూర్ ) కార్పొరేటర్ జంగిలి సాగర్ ను విచారణ కోసం పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. అతడిపై నమోదైన కేసులకు సంబంధించి మరింత విలువైన సమాచారం సేకరించేందుకు కరీంనగర్ లోని సీతారాంపూర్ లోగల అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. కాగా జంగిలి సాగర్ పై పోలీసులు మూడు రోజుల క్రితం రౌడీ షీట్ నమోదు చేశారు.