
- వచ్చే నెల 4న వరంగల్ శివారులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
- దాదాపు 15 లక్షల మందిని సమీకరించే ప్రయత్నం
- సభ కోసం వెయ్యి ఎకరాల భూములను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ లీడర్లు
- గతంలో తిరగబడిన రైతులు, స్థానికులు
- మళ్లీ తమ భూములే పరిశీలించి వెళ్లడంపై ఆందోళన
హనుమకొండ, వెలుగు: ఎన్నికలు దగ్గరపడ్తుండడంతో సీఎం కేసీఆర్ జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు. 2018 ఎన్నికల ముందు కూడా ఇలాగే ఒక్కో నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని భారీ సభలు నిర్వహించారు. ఈసారి కూడా అదే తీరుగా సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్4న సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిం చనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. కాగా రెండేండ్ల కింద వరంగల్ లో పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తెలంగాణ విజయ గర్జన సభ రద్దు కాగా.. ఆ తరహాలోనే సిటీ శివారులో దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆర్డీవో రమేశ్, కేయూ సీఐ అబ్బయ్య, పార్టీ స్థానిక నేతలతో కలిసి మంగళవారం సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలంలో పాటు హెలీప్యాడ్, పార్కింగ్ ప్లేసులు, సభకు వచ్చే ప్రజలు కూర్చోడానికి అనువైన స్థలాలను మంత్రి స్వయంగా చూశారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆఫీసర్లతో చర్చించి వెళ్లారు. కాగా ప్రతిపాదిత సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి దయాకర్రావు.. స్థానిక ఎమ్మెల్యే తోపాటు మిగతా లీడర్లు ఎవరూ లేకుండానే రావడం, కేవలం ఆఫీసర్లతో చర్చించి ఏర్పాట్లపై ఆదేశాలు ఇచ్చి వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
విజయ గర్జన సభ తరహాలోనే..
బీఆర్ఎస్ ను స్థాపించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 2021లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నవంబర్ 29న దీక్ష దివస్ రోజునే ఈ సభను నిర్వహించాలనుకున్నారు. ఈ మేరకు విజయ గర్జన సభ కోసం గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని దేవన్నపేట శివారులో రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. దాదాపు 1,100 ఎకరాలు చదును చేసి, అందులో సభా స్థలానికి 300 ఎకరాలు, నాలుగు చోట్ల మరో 800 ఎకరాలను పార్కింగ్, ఇతర అవసరాల కోసం వాడుకోవాలనుకున్నారు.
కానీ అప్పటికే ఆ స్థలంలో కోతకు వచ్చిన వరి, పత్తి, కూరగాయల తోటలు ఉండడంతో భూమి చదును చేయడాన్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాత్రి, పగలుతో సంబంధం లేకుండా పొలాల వద్దే మకాం వేసి, భూములు చదును చేయకుండా కాపలా కాశారు. రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరొచ్చినా అడ్డుకుని నిరసన తెలిపారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది రైతులను ఒప్పించారు. మిగతా వాళ్లు ఒప్పుకోకపోయినా చదును పనులు స్టార్ట్ చేశారు.
కనీలు అన్నీ తొలగించడంతో పాటు నిరూప్ నగర్ తండాకు చెందిన శ్మశాన వాటికను కూడా తొలగించారు. ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, అదే టైంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో విజయ గర్జన సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది జరిగిన రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ విషయం మళ్లీ ఇప్పుడు తెరమీదకు వచ్చింది.
స్థానికుల్లో ఆందోళన
విజయ గర్జన సభ కోసం దేవన్నపేట శివారులో రింగ్ రోడ్డును ఆనుకుని స్థలాన్ని ఎంపిక చేయగా.. ఇప్పుడు వచ్చే నెల 4న నిర్వహించే కేసీఆర్ సభకు కూడా అదే స్థలాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు అదే స్థలాన్ని ఖరారు చేశారు. కాగా పార్కింగ్ కోసం ఉనికిచెర్ల దగ్గరలో కుడా డెవలప్ చేస్తున్న ‘ఉని సిటీ’ స్థలాన్ని వాడుకోనున్నట్లు తెలుస్తోంది. కానీ సభ నిర్వహణ స్థలంలో ఇప్పటికే కొంతమంది రైతులు వరి, పత్తి, కూరగాయలు పండిస్తున్నారు.
మిగతా స్థలాన్ని కొందరు ప్లాట్లుగా చేయగా.. వాటిని కొనుగోలు చేసి కొందరు ఇండ్లు కట్టుకున్నారు. మరికొందరు కనీలు పాతి, బేస్మెంట్లు వేశారు. ఇప్పుడు సీఎం సభ కోసం అక్కడున్న ఇండ్లతో పాటు ప్లాట్లు, బేస్ మెంట్లను మొత్తం చదును చేయనున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అవన్నీ నాన్ లేఅవుట్ ప్లాట్లు కావడంతో ఇల్లీగల్ వెంచర్ గా పేర్కొంటూ అదంతా సాఫ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు ప్లాట్ల ఓనర్లు, అటు పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
మొత్తం చదును చేస్తే.. భూమి సరిహద్దుల గొడవలు మొదలయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా స్థానికులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే 2017లో ఏప్రిల్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ప్రజల ముందు.. ప్రగతి నివేదన’ పేరుతో బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జులైవాడలోని ప్రకాశ్ రెడ్డి పేటలో కూడా ఇలాగే ప్లాట్లు చదును చేసి సభ నిర్వహించారు. దీంతో హద్దురాళ్లు తొలగిపోయి అక్కడ భూ సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ కొందరు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
పరిహారం ఇచ్చుడు డౌటే?
విజయ గర్జన సభ ఏర్పాట్ల టైంలో అక్కడున్న పొలాలు, ప్లాట్లను బీఆర్ఎస్ నాయకులు కొంతమేర చదును చేశారు. అందులో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు అక్కడున్న పంటను బట్టి రూ.30 వేల వరకు పరిహారం చెల్లించారు. ఆ తర్వాత సభ వాయిదా పడడంతో రైతులు మళ్లీ పంటలు వేసుకున్నారు. కాగా ఇప్పుడు అదే స్థలంలో సభ నిర్వహించనున్నారు. రెండేండ్ల కింద పరిహారం చెల్లించినా.. సభ జరగలేదు. దీంతో ఈసారి పరిహారం ఇచ్చే అవకాశం లేదని తెలిసింది.
గతంలో ఇచ్చిన పరిహారాన్ని సాకుగా చూపి రైతుల భూములు సాఫ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో దేవన్నపేట, భీమారంశివారులోని రైతుల్లో సీఎం కేసీఆర్ సభపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బలవంతంగా భూములు చదును చేస్తే ఊరుకునేది లేదని కొంతమంది రైతులు ఆందోళనలకు రెడీ అవుతున్నారు.