
- కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్లలో టెన్షన్
- నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, అంజిరెడ్డి మధ్య పోటాపోటీ
- గెలుపులో కీలకంగా మారనున్న సెకండ్ ప్రయారిటీ ఓట్లు
- తమ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న క్యాండిడేట్లు
కరీంనగర్, వెలుగు : మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎన్నికకు, కౌంటింగ్‌కు మధ్య మూడు రోజుల సమయం ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నరేందర్‌రెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి ప్రధానంగా పోటీ పడ్డారు. నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్యే పోటీ ఉంటుందని భావించినప్పటికీ.. బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండడం, చివరి రెండు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పని చేయడం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది.
సెకండ్ ప్రయారిటీ ఓట్లే కీలకం
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో 3,55,159 ఓట్లు ఉండగా గురువారం జరిగిన ఎన్నికల్లో 2,50,328 ఓట్లు పోలయ్యాయి. అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది తప్పుగా ఓటేసే అవకాశం ఉండడంతో ముందుగా చెల్లిన ఓట్లను లెక్కిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన క్యాండిడేట్‌ను విజేతగా ప్రకటిస్తారు. కానీ ముగ్గురు క్యాండిడేట్లు పోటాపోటీగా తలపడడంతో పాటు పోలింగ్ సరళిని బట్టి చూస్తే... ఏ ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలోనే 50 శాతం వచ్చేలా కనిపించడం లేదు.దీంతో సెకండ్ ప్రయార్టీ ఓటు కీలకంగా మారనుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో క్యాండిడేట్లంతా తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందోనని లెక్కలు వేసుకుంటున్నారు.
మద్దతుపై వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వరుసగా రెండోసారి పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపలేదు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారికి నిరాశే మిలిగింది. తాము పోటీలో ఉండడం లేదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్వయంగా ప్రకటించారు. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అక్కడ కూడా నిరాశే మిగలడంతో చివరికి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. ఎన్నికల తేదీ దగ్గర పడే వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు ఆయనకు ఇంటర్నల్‌గా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రసన్న హరికృష్ణ భార్య వేములవాడలో ఎమ్మెల్సీ కవితను కలిసి మద్దతు కోరడం, ఆమె సానుకూలంగా స్పందించడంతో బీఆర్‌ఎస్ శ్రేణులకు సందేశాన్ని ఇచ్చినట్లయింది. బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ముందే అఫీషియల్‌గా ప్రకటిస్తే.. హరికృష్ణపై బీఆర్ఎస్ ముద్రపడి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు పడవని గ్రహించే ఇలా వ్యూహత్మకంగా వ్యవహరించినట్లు తెలిసింది. అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే విషయం ఆ పార్టీ శ్రేణులకు తప్ప సామాన్య ఓటర్లకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరి ధీమా వారిదే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ క్యాండిడేట్ అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఎన్నికలకు ఐదు నెలల ముందు నుంచే ప్రచారం చేయడం, సుమారు లక్షన్నర గ్రాడ్యుయేట్ ఓటర్లను ఎన్‌రోల్ చేయించడం, కాంగ్రెస్ తరఫున బరిలో నిలవడం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం తనకు కలిసి వస్తుందని అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేందర్‌రెడ్డి ఐదు నెలల ముందే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడంతో అదే స్థాయిలో నెగెటివ్ ప్రచారం కూడా జరిగిందన్న చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్ వచ్చాకే తెరపైకి వచ్చి ఉంటే ఈ స్థాయిలో నెగెటివ్ ప్రచారం జరగకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు చేసిన ప్రచారంతో పాటు ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెరిగిన బలం, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో బీజేపీ పట్ల సానుకూల ధోరణి తనను గెలిపిస్తుందని బీజేపీ తరపున బరిలో ఉన్న చిన్నమైల్ అంజిరెడ్డి భావిస్తున్నారు. ఆయన పూర్తిగా పార్టీ బలాన్నే నమ్ముకున్నారు.
బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ గ్రాఫ్ చివరి వారం రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. బీసీ వాదం ఆయనకు కలిసొచ్చింది. దీంతో పాటు కాంపిటీటివ్ బుక్స్ రచయితగా పేరున్న వ్యక్తి కావడంతో గ్రాడ్యుయేట్లకు అందులోనూ ప్రధానంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. చివరి నిమిషంలో బీఆర్‌ఎస్ పరోక్ష మద్దతు కూడా కలిసొచ్చినట్లయింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ ఓటేసిన వారు కూడా సెకండ్ ప్రయారిటీ కింద హరికృష్ణకే ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సర్వేలు కూడా తన వైపే మొగ్గు చూపడంతో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు.