
- 181, 182 సర్వే నంబర్లలో భూములన్నీ భూదాన్ బోర్డువేనని తేల్చిన అధికారులు
- 194,195 సర్వే నంబర్లలో భూములు కొన్న సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు
- ఇవి ప్రైవేట్ పట్టా భూములంటున్న అధికారులు.. కాదు భూదాన్, కంచ భూములంటున్న స్థానికులు
- ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేట్ వ్యక్తి
- అక్రమ భూములు కొన్న ఈఐపీఎల్
- కన్స్ట్రక్షన్స్కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులు
- రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటున్నది. గ్రామంలోని నాలుగు సర్వే నంబర్ల చుట్టూ నానా చిక్కులు నెలకొన్నాయి. 181, 182 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి.
ఇక194, 195 సర్వే నంబర్లలో సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులు భూములు కొనగా, అవి కూడా భూదాన్ భూములే అని స్థానికులు హైకోర్టుకు వెళ్లడం.. వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చాలని జడ్జి ఆదేశించడం.. కొనుగోలు దారులకు నోటీసులు ఇవ్వడంతో ఐఏఎస్, ఐపీఎస్‌లు, రిటైర్డ్ ఆలిండియా అధికారులు ఆందోళనలో పడ్డారు.
అటు181, 182 సర్వే నంబర్ల పరిధిలోని భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ రైడ్స్ జరిగిన ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్కంపెనీకే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు 194,195 పరిధిలోని తమ భూములను డెవలప్మెంట్కు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అన్నీ తెలిసిన ఉన్నతాధికారులు.. భూదాన్ భూములను అడ్డదారిలో పొందిన కంపెనీకి తమ భూములను డెవలప్మెంట్కు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
కాగా,194,195 సర్వే నంబర్లలో ఉన్నవి భూదాన్ భూములు కావని ఉన్నతాధికారులు చెప్తుండగా, తాజాగా అవి కంచ భూములు అని, ధరణిలో రికార్డులను మార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇవ్వబోయే నివేదికపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
అవి పట్టా భూములే అంటున్న అధికారులు
నాగారం గ్రామంలో 194, 195 సర్వే నంబర్లలో పెద్దసంఖ్యలో ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు, రిటైర్డ్ సివిల్‌సర్వీస్ అధికారులు భూములు కొనుగోలు చేశారు. ఈ సర్వే నంబర్లకు 2 కిలో మీటర్ల దూరంలో ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు ల్యాండ్ కొనుగోలు చేసి.. విల్లాలు కట్టేందుకు ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్కు ఇచ్చారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న, రిటైర్అయిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సైతం తమ పేరుతో, కుటుంబసభ్యుల పేర్లతో సర్వే నంబర్ 194లో భూములు కొని.. విల్లాల కోసం అదే ఈఐపీఎల్కన్ స్ట్రక్షన్కే డెవలప్మెంట్కు ఇవ్వడం గమనార్హం.
ఇవి కూడా భూదాన్, కంచ భూములేనని, అక్రమంగా పట్టా భూములుగా ప్రొసీడింగ్స్జారీ చేసుకున్నారని, ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో న్యాయమూర్తి 76 మంది రెస్పాండెంట్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 30 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ సర్వే నంబర్లలో ఎలాంటి భూదాన్ భూములు లేవని ఉన్నతాధికారులు అంటున్నారు.
పహాణీలతోపాటు పాత రికార్డులను వెరిఫై చేయగా కంచ పట్టా భూములుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ అవి పట్టా భూములేనని క్లారిటీ వచ్చినా.. ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్లో అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారాయి.
అసలు కథంతా భూదాన్ భూముల్లోనే !
నాగారంలో 181, 182 సర్వే నంబర్లలో భూదాన్ భూముల వ్యవహారంపైనా హైకోర్టు సీరియస్‌గా ఉంది. 42 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసి, నిషేధిత జాబితాలో ఉంచినప్పటికీ, అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్కుమార్ఆదేశాలతో మహేశ్వరం తహసీల్దార్ సహా కొందరు అధికారులు అక్రమంగా ప్రైవేట్వ్యక్తులకు బదలాయించారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో ఇప్పటికే మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేయగా, ఈడీ కూడా ఎంటరైంది. ఈక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌తోపాటు ఇతర అధికారులను, కొనుగోలుదారులు, మధ్యవర్తులతోపాటు ఈఐపీఎల్కన్స్ట్రక్షన్ప్రతినిధులను విచారించింది. 2 నెలల కింద ఆ భూములను మళ్లీ భూదాన్ భూములుగా నోటిఫై చేస్తూ సీసీఏఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
అంతకుముందు ఈ భూముల కొనుగోళ్లలో బినామీల ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్‌లోని 5 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, మొయినాబాద్‌లో భారీ నగదు, విలాసవంతమైన వాహనాలు స్వాధీనం చేసుకున్నది. ఈ దాడుల్లో నాగారంలోని 103 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని తెలుస్తున్నది.
ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు నిబంధనల ప్రకారం పేద రైతులకు వ్యవసాయం కోసమో, లేదంటే ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ డాక్యుమెంట్లతో ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నోటీసు ఇవ్వకుండానే ఉత్తర్వులు జారీ: ఐపీఎస్‌లు
ఎలాంటి నోటీసులివ్వకుండానే సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారంటూ అప్పీలుదారులు పేర్కొన్నారు. 194, 195 సర్వే నంబర్లో 30 ఎకరాలుండగా, అందులోని భూములను కొనుగోలు చేశామన్నారు. 2023 నవంబర్‌లో తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు.. సర్వే నెం.181లో 50 ఎకరాలను భూదాన్ భూమిగా పేర్కొందన్నారు.ఆ జాబితాలో 194 లేదని తెలిపారు. 2019లో 194, 195ల్లోని భూములను పట్టా భూములుగా ప్రొసీడింగ్స్ జారీ చేశారని చెప్పారు.
ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నామని, ఊహాజనిత ఆరోపణలు తమకు నష్టం కలిగిస్తాయన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయని పక్షంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.