కూపీ లాగుతోంది: FTL, బఫర్ జోన్ పరిధిలోని అనుమతులపై ఆరా..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో హైడ్రా తన, మన అనే భేదం లేకుండా సాఫీగా పని చేసుకుంటూ వెళ్లిపోతోంది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన పలు అక్రమ కట్టడాలను గుర్తించి హైడ్రా నేల మట్టం చేసింది. ఇందులో హీరో నాగార్జునతో పాటు మరికొందరు ప్రముఖ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అక్రమ కట్టడాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుడటం హాట్ టాపిక్‎గా మారింది. 

అయితే.. అక్రమ కట్టడాలను గుర్తించి ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోన్న హైడ్రా.. అందుకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపైన యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైడ్రా గండిపేటలో కొన్ని నిర్మాణలను నేలమట్టం చేసింది. అయితే.. హెచ్ఎచ్ఎండీ, ఇరిగేషన్ శాఖ అనుమతి ఇవ్వడంతోనే తాము కట్టడాలు చేపట్టామని భవన నిర్మాణదారులు కూల్చివేతల సమయంలో హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారని టాక్. దీంతో గవర్నమెంట్ ల్యాండ్స్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల  పరిధిలో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులు, క్షేతస్థాయి సిబ్బంది వివరాలను హైడ్రా సేకరిస్తున్నట్లు సమాచారం. 

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలకు సిద్ధమవుతోన్నట్లు టాక్. దీంతో ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‎లో కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖ అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా ఏ క్షణాన యాక్షన్ తీసుకుంటుందోనని అధికారులు, క్షేత స్థాయి సిబ్బంది టెన్షన్‎తో వణికిపోతున్నారని టాక్.అక్రమ నిర్మాణల విషయంలో దూకుడుగా వెళ్తున్న హైడ్రా.. అందుకు పర్మిషన్లు ఇచ్చిన అధికారంలో విషయంలో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.