అధికార పార్టీ నేతల్లో ‘పోడు’ టెన్షన్​

  • దరఖాస్తు చేసిన వారిలో మూడో వంతుకే  హక్కులు 
  • రహస్య పంపిణీపై గిరిజనుల్లో అనుమానాలు
  • అనర్హులకే పట్టాలిస్తున్నారని ఆరోపణలు

ఖమ్మం, వెలుగు:  అధికార పార్టీ నేతల్లో  పోడు పట్టాల వ్యవహరం మళ్లీ గుబులు పుట్టిస్తున్నది.  ఓ వైపు పట్టాలు పంపిణీ చేస్తున్నా, మరోవైపు పట్టాలు అందని వారు,  అర్హుల లిస్టులో పేరు లేని వారు ఆందోళనలు  చేస్తున్నారు. అనర్హులకు పట్టాలిస్తున్నారని, అధికార పార్టీ నేతల ప్రమేయంతో  ఆ పార్టీకి చెందిన వారికే  అందజేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో  కేవలం మూడో వంతు మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడంతో,  మిగిలిన వారు ఎక్కడ తమకు వ్యతిరేకంగా మారుతారోనని లీడర్లు టెన్షన్​ పడ్తున్నారు. రోజూ ఏదో ఒక చోట పోడు పట్టాల గురించి నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండడం, గిరిజన సంఘాల నేతలు కూడా మళ్లీ ఉద్యమాలు చేస్తామని చెప్తుండడంతో పోడు పోరు ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు.  ఎన్నికలకు ముందు తమకిదేం తలనొప్పని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

పట్టాలు దక్కని వారే ఎక్కువ..

రాష్ట్రంలో  ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడంతో 12,49,296 ఎకరాలకు గాను 4,14,353 క్లెయిమ్​లు వచ్చాయి. ఇందులో 28 జిల్లాల పరిధిలో 4,06,359 ఎకరాలకు సంబంధించి, 1,51,146 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి ప్రస్తుతం పట్టాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.59 లక్షల మంది, 8.14 లక్షల ఎకరాల కోసం చేసుకున్న  క్లెయిమ్​లను ఆఫీసర్లు తిరస్కరించారు. 4.70 లక్షల ఎకరాలను క్లెయిమ్​ చేస్తూ 1.80 లక్షల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోగా, వారిలో ఒక్కరికీ కూడా పట్టాలు మంజూరు కాలేదని తెలుస్తున్నది.

అసలు ఎందుకు తిరస్కరించారో కారణాలు చెప్పకపోవడంపై గిరిజనుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్వే చేయకపోవడం, ఎక్కువ విస్తీర్ణంలో సర్వే చేసినా కేవలం గుంటల్లో మాత్రమే తక్కువ విస్తీర్ణానికి పట్టా ఇవ్వడం, పట్టాలు ఇచ్చిన భూముల్లో ట్రాక్టర్లతో సాగు చేయవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులు పెట్టడం.. వంటి అంశాలకు నిరసనగా గిరిజన సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు రెడీ అవుతున్నారు. రీ సర్వే చేసి, అర్హులైన అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. 

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కొన్ని ఘటనలు

  •     కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజేపల్లి శివారులోని మర్రి తండా,  నెమలిగుట్టతండా గిరిజనులు తమకు పోడు పట్టాలివ్వకపోవడాన్ని నిరసిస్తూ అటవీశాఖ భూమిలో ట్రాక్టర్లతో దున్నారు. అందులోని బోర్డులు కూల్చివేశారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ట్రాక్టర్లను సీజ్​ చేశారు. ఫారెస్ట్ భూమి హద్దులను తొలగించడంపై పోలీసులకు అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుచేశారు. అన్ని అర్హతలు ఉన్నా  తమకు పట్టాలివ్వలేదని జూలూరుపాడు మండలం పాపకొల్లు ఫారెస్ట్ భూమిలో కొందరు రైతులు ప్లాంటేషన్​ మొక్కలను నరికి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం రావికంపాడు రైతు వేదికలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని, పట్టాలు రాని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును నిలదీశారు. అర్హులైన తమకు పోడు పట్టాలు ఇవ్వలేదని కొందరు గిరిజన రైతులు ఈనెల 4న నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్ పూర్​ గ్రామ పంచాయతీ ఆఫీస్​కు తాళం వేశారు. జీపీ సిబ్బంది ఇష్టానుసారంగా లిస్టు పంపడం వల్లే తమకు పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
  •     జగిత్యాల జిల్లా కథలాపూర్​లో హైవేపై పోతారం తండా, ఇప్పపెల్లి తండా జెమా నాయక్​ కలికోట తండా, కొచ్చగుట్టతండా, తుర్తి తండా, తాండ్రియాల తండా, భూషణ్​ రావు పేట తండా, రాజారం తండాలకు చెందిన గిరిజనులు ధర్నా చేశారు. 20 ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా పోడు పట్టాలివ్వలేదని చెప్తున్నారు.
  •     మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం ముస్మీ గ్రామానికి చెందిన కల్తీ ఎర్రక్క సాగు చేసుకుంటున్న నాలుగు ఎకరాల భూమిని సర్వే చేసిన అధికారులు, చివరికి జారీ చేసిన పట్టా పుస్తకంలో మాత్రం జీరో విస్తీర్ణం ఉండడంతో ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. 9 నుంచి దశలవారీగా ఆందోళనలు

రాష్ట్రంలో అర్హులైన పోడు రైతులకు కూడా పట్టాలు ఇవ్వలేదు.  ఈ విషయంపై ఈనెల 9 నుంచి దశలవారీగా ఆందోళనలు చేస్తాం. ముందుగా ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో సదస్సులు నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తాం. గిరిజనులను ఇబ్బంది పెట్టేలా ఫారెస్ట్, ఐటీడీఏ ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్​ నాయకులను కలవాలని చెప్పడం, పట్టాల కోసం జాబితాలో పేరుండేలా చూస్తామని ఎకరానికి రూ.5 వేల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. కేసులు ఎత్తివేస్తున్నామని నామమాత్రపు ప్రకటనలకే పరిమితమయ్యారు. వీటన్నింటిపై ఆందోళనలు ఉధృతం చేస్తాం. 
- పోటు రంగారావు, ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కార్యదర్శి