- ఈ ఏడాది మొత్తం ఏడుగురు మృతి
- జీరో యాక్సిడెంట్ల ప్రకటనలకే సంస్థ పరిమితం
- కార్మికుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో రక్షణ వారోత్సవాల సమయంలోనే మైన్స్ లో యాక్సిడెంట్లు జరుగుతుండడంతో కార్మికుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు జీరో యాక్సిడెంట్లే లక్ష్యంగా ప్రతి ఏడాది సింగరేణి భద్రత వారోత్సవాలను నిర్వహిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా సేఫ్టీ వీక్‌ను సింగరేణి నిర్వహించింది. తాజాగా గురువారం మణుగూరు ఏరియా ఓపెన్ కాస్ట్లో జరిగిన యాక్సిడెంట్ లో ఒక కార్మికుడు మృతి చెందారు. దీంతో భద్రత వారోత్సవాలపై కార్మికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
రెండేండ్లలో 12 మంది మృతి
సింగరేణిలో జరుగుతున్న యాక్సిడెంట్లు కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వివిధ ప్రమాదాల్లో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిపోర్టబుల్ ఘటనల్లో 68 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. ఇదేవిధంగా గతేడాది ఐదుగురు మృతి చెందగా.. 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో 70 మందికి రిపోర్టబుల్ ఘటనల్లో గాయాలు అయ్యాయి. మొత్తంగా ఈఏడాది 150 మంది, గతేడాది138 మంది కార్మికులు యాక్సిడెంట్లకు గురయ్యారు.
ప్రకటనలకే పరిమితమా..
జీరో యాక్సిడెంట్లే లక్ష్యంగా ప్రతి ఏడాది రక్షణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. 55వ యాన్యువల్ సేఫ్టీ వీక్‌ను ఈనెల 9 నుంచి అన్ని సింగరేణి మైన్స్, ఓపెన్‌కాస్ట్, వర్క్ షాప్స్, హాస్పిటల్స్‌తో పాటు హెడ్డాఫీసులోనూ పలు డిపార్ట్మెంట్లలో నిర్వహించింది. మైన్స్, డిపార్ట్మెంట్లలో రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మేనేజ్ మెంట్13 బృందాలను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ లు రక్షణ వారోత్సవాల తీరును పరిశీలించి సంస్థకు నివేదికలు అందజేస్తాయి. సింగరేణి డే సందర్భంగా ఈనెల 23న నిర్వహించబోయే వేడుకల సమయంలో బెస్ట్ మైన్స్, బెస్ట్ డిపార్ట్ మెంట్స్‌కు బహుమతులు అందజేయనుంది. మరోవైపు రక్షణ వారోత్సవాల నిర్వహణ కన్నా క్వాలిటీతో కూడిన పరికరాలను అందించాలని కార్మికులు కోరుతున్నారు.
జీరో యాక్సిడెంట్లే లక్ష్యంగా కొన్నేండ్లుగా చేస్తామని చెబుతున్నా ఆగడంలేదంటున్నారు. అవగాహన లోపం, నిర్లక్ష్యంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. అధికోత్పత్తికి ఇచ్చే ప్రాధాన్యత, రక్షణకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొందరు జీఎంలు, మైన్మేనేజర్లు సంస్థ రికార్డుల కోసమే అన్నట్టుగా మైన్స్ లో పర్యటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సేఫ్టీకే ఫస్ట్ ప్రియార్టీ
సింగరేణిలో జీరో యాక్సిడెంట్లే లక్ష్యంగా ప్రతి ఏడాది రక్షణ వారోత్సవాలను నిర్వహించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సేఫ్టీకే ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నాం. ఎక్కువగా మానవ తప్పిదాలు, నిర్లక్ష్యంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీలున్నంతగా యాక్సిడెంట్లను తగ్గించేలా చూస్తున్నాం.
సీహెచ్ శ్రీనివాస్, జీఎం సేఫ్టీ, సింగరేణి కాలరీస్ జీఎం