హెచ్​సీయూలో కొనసాగుతున్న టెన్షన్.. 50 జేసీబీలతో 400 ఎకరాల చదును పనులు

హెచ్​సీయూలో కొనసాగుతున్న టెన్షన్.. 50 జేసీబీలతో 400 ఎకరాల చదును పనులు
  • మళ్లీ ఆందోళనలు మొదలుపెట్టిన స్టూడెంట్స్
  • బయటి వ్యక్తులు ఏసీపీపై దాడి చేశారన్న డీసీపీ
  • ఏసీపీ శ్రీకాంత్​ గాయపడ్డారని ప్రకటన విడుదల 
  • 400 ఎకరాలపై రెవెన్యూ సర్వే జరగలేదన్న రిజిస్ట్రార్

గచ్చిబౌలి, వెలుగు:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్​సీయూ)లో టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నది. 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో జేసీబీలు వెళ్లగా, వాటికి భద్రతగా సైబరాబాద్ పోలీసులు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే వర్సిటీ ఈస్ట్ క్యాంపస్ నుంచి 400 ఎకరాలను చదును చేయడం మొదలుపెట్టారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సోమవారం సాయంత్రం వరకు సుమారు 50 జేసీబీలు 50 ఎకరాలను చదును చేశాయని విద్యార్థులు ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండా, జీవవైవిధ్యం దెబ్బతీసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని విద్యార్థులు మండిపడ్డారు. పచ్చని చెట్లను తొలగిస్తుండడంతో అక్కడ నివసించే వన్యప్రాణులకు ఆవాసం లేకుండా పోతోందని వాపోయారు. ప్రభుత్వం 400 ఎకరాలను వేలం వెయ్యడాన్ని నిలిపివేయాలని కోరారు.

విద్యార్థులను రెచ్చగొడుతున్నారు: మాదాపూర్ డీసీపీ  

హెచ్​సీయూలో చోటుచేసుకున్న పరిణామాలపై మాదాపూర్ జోన్ డీసీపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్సిటీలో విద్యార్థులపై ఆదివారం లాఠీచార్జ్ జరిగిందని ప్రచారం చేస్తున్నారని, వర్సిటీ స్టూడెంట్స్​ను కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు వర్సిటీ ఈస్ట్ క్యాంపస్ వద్ద భూమి చదును పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు వచ్చి పోలీసులతో పాటు పని చేస్తున్న వారిపై దాడులకు దిగారని చెప్పారు. ఈ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని, దీంతో గచ్చిబౌలి పోలీసులు 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశారన్నారు. టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోహిత్, నవీన్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు. వీళ్లిద్దరికి క్యాంపస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడికొచ్చి అల్లర్లు సృష్టించారని తెలిపారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, విద్యార్థులను హాస్టల్స్ నుంచి బయటకు లాక్కెళ్లారని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్ లో పడవద్దని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

జేసీబీలతో చదును చేస్తుండడంపై విద్యార్థులు సోమవారం ఉదయం నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్రగా క్యాంపస్ లోపల నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు తీసుకువచ్చారు. ప్రధాన ద్వారం వద్ద అప్పటికే భారీగా ఉన్న పోలీసులు శవయాత్రను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీజీఐఐసీ ప్రకటన ఖండిస్తున్నాం:

హెచ్​సీయూ రిజిస్ట్రార్ 400 ఎకరాల భూమిపై టీజీఐఐసీ చేసిన ప్రకటనలను హెచ్​సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. అసలు ఈ 400 ఎకరాల భూమిపై రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే చేపట్టలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ భూమి సరిహద్దునే గుర్తించలేదన్నారు. వర్సిటీ భూమి అన్యాక్రాంతమవుతున్నదని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. వర్సిటీ వర్గాలు లేవనెత్తిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పున:పరిశీలించాలని కోరారు. జీవవైవిధ్యాన్ని పర్యావరణాన్ని పరిరక్షించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.