- ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు.. చీరలు, తాళ్లతో హద్దులు ఏర్పాటు చేసిన జనాలు
- ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం నేరమని అధికారుల హెచ్చరిక
- చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపై రాళ్ల దాడి
- స్థలాలు ఇచ్చేదాకా కదిలేది లేదని బైఠాయించిన ప్రజలు
మియాపూర్, వెలుగు: మియాపూర్లోని సర్వే నెంబర్100,101లో ఉన్న హెచ్ఎండీఏ భూముల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 504 ఎకరాలు ఉన్న ఈ భూముల్లో గత కొద్ది రోజులుగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకుంటున్నారు. పోలీసుల సహకారంతో హెచ్ఎండీఏ అధికారులు గుడిసెలు వేస్తున్న వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపిచే ప్రయత్నం చేస్తున్నా.. తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చే దాకా కదిలేని లేదని అక్కడే కూర్చుంటున్నారు. ఇప్పటి వరకు ఓ స్థానిక మహిళ మరికొంత మందితో కలిసి 100,101 సర్వే నంబర్లలో ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ ఆందోళన చేసింది. రెండు, మూడు రోజులుగా మరో మహిళ తనకు తెలిసిన మహిళలను వేలాది మందిని తీసుకువచ్చి చీరలు, తాళ్లతో హద్దులు ఏర్పాటు చేసుకొని, గుడిసెలు వేసింది. అక్కడ ఏకంగా గుడి కట్టేసి ఈ స్థలమంతా తమదేనని హంగామా చేస్తున్నారు. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం హెచ్ఎండీఏ ఎస్టేట్ఆఫీసర్ వీరారెడ్డి, శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి, మాదాపూర్ జోన్ ఏడీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని, వారితో మాట్లాడారు. సాయంత్రం పోలీసులు భారీగా చేరుకొని కొందరిని ప్రభుత్వ స్థలంలో నుంచి పంపించివేశారు. మిగిలిన వారిని కూడా చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. వారు పోలీసులపైకి రాళ్లు విసివారు. ఈ దాడిలో హెచ్ఎండీఏ అధికారి ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, ప్రజలు మాత్రం తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చేదాకా ఎక్కడికీవెళ్లేది లేదని అక్కడే బైఠాయించారు.
ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తే ఉపేక్షించం: ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి
ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి, కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్వీరారెడ్డి హెచ్చరించారు. మియాపూర్లోని100,101 సర్వే నంబర్లలో 504 ఎకరాల ప్రభుత్వ భూమి కోర్టు వివాదంలో ఉందని చెప్పారు. అయితే, కొందరు ఇక్కడ పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారని ప్రచారం చేయడంతో ప్రజలు ఇక్కడ గుడిసెలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు లేవని పేర్కొన్నారు. భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.