కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​ వద్ద ఉద్రిక్తత

  • ఎమ్మెల్యే కూనంనేని, ఏఐటీయూసీ నేతలు..పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ మధ్య వాగ్వావాదం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 27వ తేదీన సింగరేణిలో గుర్తింపుసంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో యూనియన్లు పోటాపోటీగా ప్రచారం చేపట్టాయి. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ వద్ద ప్రచారం చేసేందుకు సీఐటీయూ, టీబీజీకేఎస్​ నేతలు రావడంతో పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మంత్రి పొంగులేటి వస్తున్నారని, లోపలికి వెళ్లేందుకు వీల్లేందని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా యూనియన్ల నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొంతసేపటికే హెడ్డాఫీస్​లో ప్రచారం చేసేందుకు ఏఐటీయూసీ నేతలతో కలిసి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అక్కడకు వచ్చారు. వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్లు, గార్డులు అడ్డుకున్నారు. దీంతో  పోలీసులు, సెక్యూరిటీ గార్డులతో ఎమ్మెల్యే, ఏఐటీయూసీ నేతలు వాగ్వాదానికి దిగారు. హెడ్డాఫీస్​ గేట్లను ఓపెన్​ చేసుకొని ఎమ్మెల్యే, ఏఐటీయూసీ నాయకులు చొచ్చుకొని వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. తనను  ఎందుకు ఆపుతున్నారంటూ సెక్యూరిటీ ఆఫీసర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టైంలోనే సింగరేణి డైరెక్టర్​ బలరాం అక్కడకు చేరుకున్నారు.

ఎమ్మెల్యేను ఎందుకు ఆపారంటూ సింగరేణి అధికారులతోపాటు సెక్యూరిటీ ఆఫీసర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ప్లాన్​ చేసుకోవడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. హెడ్డాఫీస్​లో ప్రచారం చేసుకునేందుకు ఎమ్మెల్యేకు డైరెక్టర్​పర్మిషన్​ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. హెడ్డాఫీస్​లో ఎమ్మెల్యే, ఏఐటీయూసీ నేతలు ప్రచారం చేస్తున్న టైంలోనే మంత్రి పొంగులేటితో, ఐఎన్​టీయూసీ నేతలు అక్కడకు వచ్చారు. ఇరు పక్షాలకు ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

బీఆర్ఎస్​ సర్కారు, సింగరేణి సీఎండీ కుమ్మక్కై రూ. 60వేల కోట్లు డైవర్ట్​ చేసిన్రు : ఎమ్మెల్యే కూనంనేని 

గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​, సింగరేణి సీఎండీ శ్రీధర్​ కుమ్మక్కై కంపెనీకి చెందిన దాదాపు రూ. 60వేల కోట్లను డైవర్ట్​ చేశారని సీపీఐ స్టేట్​సెక్రటరీ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని కోరుతూ కొత్తగూడెంలోని పీవీకే–5 ఇంక్లైన్​, సింగరేణి హెడ్డాఫీస్​లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. సీఎండీ, బీఆర్ఎస్​ గవర్నమెంట్​వ్యవహరించిన తీరుతోనే సింగరేణి జీతాల కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

తొమ్మిదేండ్ల కాలంలో సింగరేణిలో జరిగిన కుంభకోణాలు, అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలోనూ చర్చకు తెచ్చానని గుర్తు చేశారు. సింగరేణిలో ఆర్థిక విధ్వంసం, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లైంట్​ ఇవ్వనున్నట్టు తెలిపారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రోగ్రాంలో యూనియన్​ నేతలు వంగా వెంకట్, రమణమూర్తి, క్రిష్టఫర్, రాము, బి. శ్రీను, సుదీర్, అనంతలక్ష్మి, భాగ్యలక్ష్మి, రవీందర్​ పాల్గొన్నారు.