యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం.. తూప్రాన్ పేట వల్లభ మిల్క్ కంపెనీలో ఉద్రిక్తత

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం.. తూప్రాన్ పేట వల్లభ మిల్క్ కంపెనీలో ఉద్రిక్తత
  • గ్రామస్తులు, కంపెనీ సిబ్బంది పరస్పర దాడులు
  • గాయపడ్డ చౌటుప్పల్ మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి 
  • శాంపిల్స్ సేకరించిన పీసీబీ అధికారులు

చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట పరిధిలోని వల్లభ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ వదిలే వ్యర్థాలతో తమ భూముల్లో పంటలు పండకుండా నష్టపోతున్నామని, పశువులు నీరు తాగి చనిపోతున్నాయని గ్రామస్తులు ఈనెల 11 నుంచి కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. 

అంతేకాకుండా పీసీబీ అధికారులకు కంప్లయింట్ చేయడంతో  సోమవారం ఎంక్వైరీకి వస్తున్నారనే సమాచారంతో గ్రామస్తులంతా కంపెనీ వద్దకు చేరుకున్నారు. కంపెనీలోకి వెళ్తుండడంతో  సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డికి గాయాలు కావడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఆయనకు నీరు తాగించి పక్కన కూర్చోబెట్టారు.

సీఐ మన్మధ కుమార్ సిబ్బందితో వెళ్లి  ఇరువర్గాలను చెదరగొట్టారు. మధ్యాహ్నం తర్వాత పీసీబీ అధికారులు కంపెనీలో తనిఖీలు చేపట్టి పరిసరాల్లో శాంపిల్స్ సేకరించారు. స్థానికంగా బావులు, బోర్ల నుంచి మరికొన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపిస్తామని పీసీబీ అధికారులు తెలిపారు. మాజీ ఎంపీపీ పై దాడి సమాచారంతో చౌటుప్పల్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లారు. సాయంత్రం వరకు కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పక్కనే ఉన్నా పట్టించుకోలేదు. దాడి చేసిన కంపెనీ సిబ్బందిపై మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి పోలీసులకు కంప్లయింట్ చేశారు.