వెలిమినేడు ఎంపీఎల్ కంపెనీ వద్ద ఉద్రిక్తత

నార్కట్​పల్లి,వెలుగు : నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీఎల్​ స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణపై శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. దీని కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామ యువకులు, అఖిలపక్ష పార్టీ లీడర్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయగా..గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్​ రెడ్డి, సీఐ మహేశ్, ఎస్ఐ రవి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అఖిలపక్ష లీడర్లు మాట్లాడుతూ.. గ్రామంలో ఎంపీఎల్ ​కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ జరపవద్దంటూ చెప్పిన అధికారులు..మళ్లీ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుండడంతో టెంట్లు కూల్చివేశామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కంపెనీ విస్తరణ జరగనివ్వమన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. ఊరికి 500 మీటర్ల దూరంలోనే కంపెనీ ఉందని, దూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్​చేశారు. గొర్రెల మేకల పెంపకదారుల సంఘం చైర్మన్ బైకని నాగరాజు యాదవ్ మాట్లాడుతూ...కంపెనీని విస్తరిస్తే వెలిమినేడుతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు కాలుష్యం బారిన పడతారన్నారు.