- ఎమ్మెల్యే సునీతారెడ్డి సొంతూరిలో ఉద్రిక్తత
శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామమైన గోమారంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భగత్ సింగ్ అసోసియేషన్ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. శోభాయాత్ర కొనసాగుతున్న క్రమంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి ఇంటిముందు కాంగ్రెస్ నాయకులు పటాకులు కాల్చారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి ఇక్కడ పటాకులు కాల్చకండి ముందుకు వెళ్లండి అని సూచించారు. ఈ క్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులకు, వారికి మాటా మాట పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. విషయం తెలుసుకుని పోలీసు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి గణేశ్ నిమజ్జనం పూర్తి చేయించారు. కాగా ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్దేశ్య పూర్వకంగా పటాకులు కాల్చుతూ ఇటుకలు, కర్రలతో ఇంటిపై దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కేసు నమోదు చేశాం: ఎస్పీ
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భగత్‌సింగ్ అసోసియేషన్‌వారు నిమజ్జన యాత్ర చేస్తున్న సందర్భంగా కొందరు వ్యక్తులు గొడవ పడి ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై దాడి చేసి కొట్టారని ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.