సాగర్ పై అ‘టెన్షన్’

  • సాగర్ పై అ‘టెన్షన్’
  • ఇరు వైపులా మోహరించిన ఏపీ, తెలంగాణ పోలీసులు
  • రంగంలోకి దిగిన కేఆర్ఎంబీ.. 
  • ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై కేసులు
  • ఐపీసీ సెక్షన్ 441, 448, 427 కింద నమోదు
  • కాసేపట్లో ఇరిగేషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్

హాలియా : నాగార్జునసాగర్ డ్యామ్ పై ఇవాళ కూడా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. నాగార్జునసాగర్ డ్యామ్ లోని కొంత భాగాన్ని ఏపీ అధికారులు, పోలీసులు ఆక్రమించారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన బోర్డు సంఘటనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. శుక్రవారం ఉదయం ఈఎన్సీ సభ్యులు నాగార్జునసాగర్ చేరుకున్నారు. సభ్యులు నేరుగా ఏపీ అధికారుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. 

నిన్న తెల్లవారుజామున కుడి కాలువ నుంచి ఏపీ 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రా ప్రాంతం వైపు పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, తెలంగాణ వైపు నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావు నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రాజెక్టులోని 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తాయని ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. అందుకే తాము అక్కడ ముండ్ల కంచెలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు.   మరి కొద్దిసేపట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. 

ఇరిగేషన్ ఆఫీసర్లు, పోలీసులపై కేసు

నిన్న తెల్లవారుజామున ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్‌ నుంచి డ్యామ్‌పైకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆంధ్రా పోలీసులు డ్యామ్‌ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్‌ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిపై దాడిచేశారు. తెలంగాణ పోలీసులు సాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొడక్షన్ కోర్స్ అధికారులు, నీటిపారుదల శాఖ తెలంగాణ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్ర ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ అధికారులపై ఐపీసీ సెక్షన్ 441, 448, 427 ల కింద కేసు నమోదు చేశారు.