నస్పూర్​లో బీజేపీ.. కాంగ్రెస్‌‌ ఫైటింగ్ ..ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన గొడవ 

నస్పూర్​లో బీజేపీ.. కాంగ్రెస్‌‌ ఫైటింగ్ ..ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తలెత్తిన గొడవ 
  • ఎస్ఐ కొట్టాడని ముందుగా ధర్నాకు దిగిన బీజేపీ నేతలు 
  • అల్లరిమూకలు రాళ్లు విసరడంతో ఉద్రిక్త  పరిస్థితులు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన 
  • సీపీ శ్రీనివాస్​, డీసీపీ భాస్కర్​  
  • విధులను అడ్డుకున్నారని ఎస్ఐ ఫిర్యాదుతో బీజేపీ నేతలపై కేసు

నస్పూర్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన గొడవతో మంచిర్యాల జిల్లా నస్పూర్​లోని తీగల్​ప‌‌హాడ్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవగా ​ఇరుపార్టీల నేతల  ఎంట్రీతో ఘర్షణ జరిగింది. దారికి అడ్డంగా పెట్టిన వెహికల్స్ ను  తీయాలని, ఓటర్లని ప్రభావితం చేయొద్దని పోలీసులు హెచ్చరిం చారు.

దీంతో   బీజేపీ నేతలు వాదనకు దిగారు. కాంగ్రెస్ నేతలు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం తిట్టుకోగా  పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కాంగ్రెస్​నేతలకు స్థానిక ఎస్ఐ సుగుణాకర్​మద్దతు పలుకుతూ  తమను కొట్టాడని  బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఇదే అదునుగా కొందరు అల్లరిమూకలు రాళ్లు విసరడంతో పరిస్థితి అదుపుతప్పింది.

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్​వెళ్లి ఇరువర్గాలతో మాట్లాడి, అల్లరిమూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. అల్లరిమూకలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరువర్గాలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. 

డీసీపీకి బీజేపీ నేతల ఫిర్యాదు

 ఆందోళన చేస్తుండగా కాంగ్రెస్ నేతలు పోలీసుల వద్ద లాఠీలు లాక్కొని తమపై దాడి చేశారని బీజేపీ లీడర్​ వెరబెల్లి రఘునాథ్​రావు ఆరోపించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో డీసీపీ భాస్కర్​ను కలిసి ఫిర్యాదు చేశారు.   

ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు

 నస్పూర్​ ఎస్ఐ సుగుణాకర్ విధులకు ఆటంకం కలిగించి, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన పబ్బతినేని కమలాకర్ రావు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్  తెలిపారు. తీగల్​పహాడ్ స్కూల్ వద్ద సెక్షన్ –163 అమలులో ఉండగా కమలాకర్ రావుతో పాటు మరికొందరు వెళ్లి ఎస్ఐతో వాదనకు దిగి  దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారని ఎస్ ఐ సుగుణాకర్ కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేశామని చెప్పారు.