- బీఆర్ఎస్ కార్యకర్తలను రానివ్వలేదని ఎమ్మెల్యే సబిత నిరసన
- మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ను అడ్డగింత.. అధికారులతో వాగ్వాదం
ఎల్బీనగర్, వెలుగు : మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. ఆర్కేపురం ఖిలా మైసమ్మ ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరయ్యారు. అయితే తనతో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా అని పోలీసులను ప్రశ్నించింది.
దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అనుమతించారు. కొద్దిసేపటి తర్వాత నియోజకవర్గ కాంగ్రెస్ నేత, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కార్యకర్తలతో అక్కడికి వచ్చారు. అంతా కలిసి చెక్కుల పంపిణీ స్టేజ్వద్దకు చేరుకున్నారు. మొదట చెక్కుల పంపిణీ ఇన్చార్జ్ ఆఫీసర్వేణుగోపాల్ ను స్టేజ్ మీదకు పిలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సబితను పిలిచారు. ఆ వెంటనే కాంగ్రెస్నేతలు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటూ లక్ష్మారెడ్డిని స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. దీంతో మరోసారి ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే సబిత కుర్చీలోంచి లేచి స్టేజ్దిగారు. ప్రొటోకాల్ ప్రకారమే కార్యక్రమం నిర్వహించాలని, కాంగ్రెస్ నేతలు స్టేజ్ పైకి ఎలా వస్తారని ప్రశ్నించింది.
స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సబితకు అనుకూలంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు జై కేఎల్ఆర్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అధికారులతో వాగ్వాదానికి దిగిన సబిత, చెక్కుల పంపిణీని బాయ్కాట్చేసి గుడి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అదే సమయంలో అధికారులు, కేఎల్ఆర్కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
60 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతను తీసుకొచ్చి, ప్రభుత్వ కార్యక్రమంలో చెక్కులు పంచడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం ప్రొటోకాల్ ను గౌరవించే సంస్కృతిని మర్చిపోతోందని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై కేఎల్ఆర్ స్పందిస్తూ గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిందే తామూ చేస్తున్నామని బదులిచ్చారు.