ఉత్తరాఖండ్​లో హింస.. మదర్సా కూల్చివేతతో హల్ద్వానీలో టెన్షన్

హల్ద్వానీ: ప్రభుత్వ జాగలో అక్రమంగా నిర్మించిన మదర్సాను, దాని ఆవరణలోని మసీదును కూల్చివేస్తుండగా జరిగిన హింసాకాండలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్​లో నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. నైనిటాల్ జిల్లాలోని బన్​భూల్​పురలో ప్రభుత్వ స్థలంలో కట్టిన మదర్సా, మసీదును కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు గురువారం ప్రయత్నించారు.

దీనికి వ్యతిరేకంగా స్థానికులు  ఆందోళనకు దిగారు. వాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను దింపారు. ఆందోళనకారులు రాళ్లు విసరడం మొదలు పెట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. పోలీసుల వెహకల్స్​ను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. మదర్సాకు దగ్గరలోని పోలీస్ స్టేషన్​కు కూడా నిప్పంటించారు. దీంతో ఉన్నతాధికారులు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కాల్పుల్లో బులెట్లు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో 100 మందికిపైగా గాయపడ్డారు.

ప్లాన్ ప్రకారమే అల్లర్లు.. 

అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ హల్ద్వానీలో టెన్షన్ వాతావరణం నెలకొందని నైనిటాల్ కలెక్టర్ వందనా సింగ్, ఎస్పీ ప్రహ్లాద్ మీనా శుక్రవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధించి 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని చెప్పారు. పోలీస్ స్టేషన్​కు నిప్పు పెట్టడంతోనే ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5 వేల మందిపై కేసు నమోదదు చేశామని, ఇప్పటి వరకు పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు.

అల్లర్లను రెచ్చగొట్టేందుకు 15 నుంచి 20 మంది ప్రయత్నించారని, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రావడానికి ముందే వాళ్లు మసీదు చుట్టుపక్కల ఇండ్ల డాబాలపై రాళ్లు రెడీగా పెట్టుకున్నట్లు గుర్తించామని తెలిపారు. కూల్చివేతలు ఆపడం కంటే, పోలీసులను టార్గెట్ చేసేందుకు వారు ప్లాన్ చేశారని, పోలీస్ స్టేషన్ పై పెట్రోల్ బాంబులు విసిరారని చెప్పారు. అందులో కొందరి వద్ద కంట్రీ మేడ్ పిస్టల్స్ ఉన్నట్లు కూడా తెలిసిందన్నారు. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం డెహ్రాడూన్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేసేందుకు హల్ద్వానీలో క్యాంప్ నిర్వహించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినవాళ్లను గుర్తించి, చర్యలు తీస్కోవాలని ఆదేశించారు.