డబ్బు, లిక్కర్ పంపిణీ అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్ లీడర్లపై దౌర్జన్యం
టీఆర్ఎస్ నేతల ఆగడాలను పట్టించుకోని పోలీసులు
అక్రమాలను అడ్డు కున్నోళ్లపైనే దబాయింపులు
లిక్కర్‌ను పట్టుకున్నందుకు చైతన్యపురిలో బీజేపీ ఆఫీస్ పై టీఆర్ఎస్ దాడి
బీజేపీ క్యాండిడేట్ చేయి ఫ్రాక్చర్.. కార్యకర్తలకు గాయాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్‌కు ముందురోజైన సోమవారం సిటీవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న పరిస్థితి కనిపించలేదు. ప్రచారం గడువు ముగిశాక కూడా నాన్‌లోకల్ నేతలు సిటీలోని హోటళ్లు, లాడ్జీల్లో ఉండి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. దాదాపు అన్ని డివిజన్లలో వివిధ పార్టీల అంతర్గత ప్రచారాలు, డబ్బు, లిక్కర్ పంపిణీ యథేచ్చగా సాగాయి. పలుచోట్ల గొడవలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డబ్బు, లిక్కర్ పంపకాలను అడ్డుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగారు. మరికొన్ని డివిజన్లలో డబ్బు పంచుతున్న నేతలను స్థానికులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎలక్షన్ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులంతా టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఉల్టా తమపైనే కేసులు పెడుతున్నారని పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుచోట్ల ఆందోళనలు చేశారు.
అక్రమాన్ని ఆపినోళ్లపైనే దబాయింపులు
టీఆర్‌ఎస్ క్యాండిడేట్లు, వారి అనుచరులు డబ్బు, లిక్కర్ పంచుతుంటే అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు దబాయింపులు, బెదిరింపులు ఎదురయ్యాయి. తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలే తప్ప.. నేరుగా అడ్డుకోవడం వంటివి చేయొద్దని పోలీసులు చెప్తున్నారని.. మరికొన్నిచోట్ల టీఆర్ఎస్నేతలు తమపై దాడులకు దిగారని ప్రతిపక్షాల నేతలు వాపోయారు. టీఆర్ఎస్ వాళ్లు బస్తీలు, కాలనీల్లో రహస్యంగా డబ్బులు పంచుతున్నారని.. పోలీసులు ఎప్పుడు వచ్చి అడ్డుకుంటారని నిలదీశారు. కొన్నిచోట్ల అయితే డబ్బు, లిక్కర్ పంపిణీని అడ్డుకున్న వారినే అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా చూసీ చూడనట్టుగా ఉంటున్నారంటూ.. బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతలు ఈసీ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు.
నాన్ లోకల్ వాళ్లు ఇక్కడ్నే..
ఎలక్షన్ ప్రచారం ముగియగానే నాన్ లోకల్ నేతలు, కార్యకర్తలంతా గ్రేటర్ హైదరాబాద్ దాటి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది. కానీ చాలా మంది నేతలు డివిజన్లలోనే ఉండి.. డబ్బు, లిక్కర్ పంపకాలను కో ఆర్డినేట్ చేశారు. పార్టీ ఎక్కడెక్కడ వెనకబడిందో అంచనా వేసుకొని.. ఆయా ప్రాంతాల్లో నాన్ లోకల్ నేతల ఆధ్వర్యంలోనే నగదు పంచారు. టీఆర్ఎస్ నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత అనుచరులు హైదరాబాద్ లోని గడ్డి అన్నారం ప్రాంతంలో ఓటర్లకు డబ్బు, లిక్కర్ పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. బూత్ కు ఒక ఇన్‌చార్జిని నియమించి ఆ నేత ఆధ్వర్యంలో డబ్బులు పంచుతున్నట్టు వారు స్థానికుల ముందు ఒప్పుకొన్నారు. ఈ ఒక్కచోటే కాదు సిటీ వ్యాప్తంగా హోటళ్లు, హాస్టళ్లు, గెస్ట్ రూముల్లో నాన్ లోకల్ నేతలు తిష్టవేసి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గుడిమల్కాపూర్, జియాగూడ, కూకట్‌పల్లి, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, ఆర్సీపురం, పటాన్‌చెరు డివిజన్లలో నాన్ లోకల్ నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. వారిపై స్థానిక పోలీసులు, ఈసీకి కంప్లైంట్చేసినా చర్యలు తీసుకోవట్లేదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ఔటర్ అవతలి నుంచి లిక్కర్
ఎలక్షన్ల సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో లిక్కర్ అమ్మకాలపై ఆంక్షలు విధించగా.. ఔటర్ రింగు రోడ్డు బయటి నుంచి జోరుగా లిక్కర్ తరలివస్తోంది. వైన్‌షాపుల మూసివేతకు ముందే భారీగా లిక్కర్ కొని స్టాక్ పెట్టుకున్న క్యాండిడేట్లు.. బయటి నుంచి కూడా తెప్పిస్తూ ఓటర్లకు పంచారు. సిటీ శివార్లలో పెట్టిన చెక్‌పోస్టులు ఈ రవాణాను అడ్డుకోలేకపోయాయి. ముఖ్యంగా టీఆర్ఎస్నేతలు, కార్యకర్తలు అయితే.. బాజాప్తాగా లిక్కర్ తరలిస్తున్నారని, పోలీసులు వారిని ఆపే ధైర్యం చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
యథేచ్ఛగా డబ్బు, లిక్కర్ పంపిణీ
గట్టిగా పోటీ ఉన్న డివిజన్లలో క్యాండిడేట్లు భారీగా డబ్బు, లిక్కర్ పంచారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నేతలు భారీగా ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారని ఆయా డివిజన్లలోని స్థానికులు చెప్తున్నారు. నేరుగా డబ్బు పంచుతుంటే.. ప్రతిపక్షాల కార్యకర్తలు అడ్డుకుంటుండటంతో.. క్యాండిడేట్లు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం
తదితర మొబైల్ అప్లికేషన్ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓటర్లకు రూ.5 వేల చొప్పున ట్రాన్స్ ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్లకు ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని, టీఆర్ఎస్‌కు ఓటేయాలని చెప్తున్న ఆడియో కూడా బయటికి వచ్చింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ డివిజన్‌లో డబ్బు పంచేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను స్థానికులు అడ్డుకున్నారు.
రాజేంద్రనగర్ లోని 60వ డివిజన్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారన్న విషయం తెలిసి బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలను, వారి దగ్గర దొరికిన డబ్బును పోలీసులకు అప్పజెప్పారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు.
ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వైలెన్స్ టీమ్‌లు ఫెయిలైనయి: ఈసీ
గ్రేటర్ హైదరాబాద్‌లో డబ్బు, లిక్కర్ పంపిణీని అడ్డుకోవడంలో ఫ్లయింగ్ స్వ్కాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు ఫెయిలయ్యాయని ఎలక్షన్ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 స్టాటిక్ సర్వైలెన్స్ టీములను ఏర్పాటు చేసినా ఆదివారం రాత్రి నగదు, లిక్కర్ పంపిణీ, తరలింపును అడ్డుకోలేకపోయాయని పేర్కొంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం పొద్దున వరకు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పొలిటికల్ పార్టీలు, క్యాండిడేట్లు ప్రయత్నించే ఆస్కారం ఉందని తెలిపింది. స్క్వాడ్లు, సర్వైలెన్స్ టీములు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, ఇలాంటి చర్యలను నిలువరించాలని.. నగదు, లిక్కర్ పంపిణీ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.