కోరుట్లలో హైటెన్షన్.. కౌన్సిలర్ భర్త అంతిమయాత్రలో ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం 2023 ఆగస్టు 08 మంగళవారం హత్యకు గురైన  బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజం అంతిమయాత్రలో గందరగోళం నెలకొంది. హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ లక్ష్మీరాజం మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు కోరుట్ల జాతీయ రహదారిపై బైఠాయించారు. అంతటితో ఆగకుండ లక్ష్మీరాజం బంధువైన సాగర్ అనే యవకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో పోలీసులకు లక్ష్మీరాజం కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయం జరిగేవరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని తేల్చి చెప్పారు.    

ఏం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా కోరుట్లలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజం 2023 ఆగస్టు 08 మంగళవారం దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై అందరూ చూస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతనికి తీవ్ర గాయం కావడంతో.. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు.

కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తాలో ఉదయం.. ఓ హోటల్‌లో లక్ష్మీరాజం తన సహచరులతో కలిసి టీ తాగుతున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చారు. మెడపై కత్తులతో నరికేశారు. దీన్ని  చూసిన వారంతా గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అదే బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో కిందపడిన లక్ష్మీరాజంను స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

అయితే.. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దీంతో లక్ష్మీరాజం ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ కూడా పరిశీలించారు. దాడి చేసింది ఎవరు, కారణాలేంటి? ఈ ఘటనతో కోరుట్లలో భయానక వాతావరణం నెలకొంది. అయితే.. లక్ష్మీరాజం మామిడి తోటల కాంట్రాక్టర్‌. ఈ క్రమంలో పలు భూములకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.